- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారుకు ప్రమాదం!
హైదరాబాద్, మహా.
తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అన్నారం గ్రామ సమీపంలో గురువారం ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాన్ని.. వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. అయితే, సరిగ్గా అదే సమయానికి కారులోని ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో వీరేశం ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఎమ్మెల్యేను దెబ్బతిన్న వాహనంలో నుంచి జాగ్రత్తగా వెలుపలికి తీసుకువచ్చారు. అనంతరం ఆయనను మరో కారులో అక్కడి నుంచి సురక్షితంగా పంపించారు. ఎమ్మెల్యే వాహనం ప్రమాదానికి గురైందన్న వార్త తెలుసుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, క్షేమంగానే ఉన్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. కారు మితిమీరిన వేగంతో రావడానికి గల కారణాలు, డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు.








