- రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
- మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్ పోను ప్రారంభించనున్న సీఎం
- రూ. 9 వేల కోట్లతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శఁకుస్థాపనలు
- మూడవ రోజు భారీ బహిరంగసభ
హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పరిశ్రమలు, రహదారులు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 13 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనుండగా.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రూ.46.08 కోట్ల విలువైన ప్రభుత్వ భవనాలను ప్రారంభించనున్నారు.
నవంబర్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హకీంపేటకు చేరుకుని మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రదర్శన స్టాళ్లను సందర్శించి ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ రైతుమేళాలో 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, సాగు పరికరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలను ప్రదర్శించనున్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులతో సాంకేతిక సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటలు, మార్కెటింగ్ అవకాశాలు, పంటల విలువ ఆధారిత ఉత్పత్తులపై సీఎం అవగాహన కల్పించనున్నారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా చర్చించనున్నారు. తొలి రోజు వికారాబాద్, నారాయణపేట జిల్లాల నుంచి సుమారు 7,500 మంది రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక రెండో రోజైన నవంబర్ 8వ తేదీన సీఎం రేవంత్ స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమవుతారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మహిళల పాత్ర, వారి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలపై చర్చించనున్నారు. అనంతరం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు.
అదే రోజు హకీంపేటలో రూ.4 కోట్లతో నాట్కో సంస్థ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. బొంరాస్‌పేటలో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభిస్తారు. కొడంగల్‌లో రూ.3.80 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ భవనాలు కూడా ప్రారంభోత్సవానికి రెడీ అయ్యాయి. దుద్యాలలో రూ.3 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్, రూ.12 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. కోస్గిలో రూ.6 కోట్లతో నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియం, దౌల్తాబాద్‌లో రూ.4.79 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలంపేటలో రూ.2.35 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నారు.
ఈ పర్యటనలో చేపట్టనున్న ప్రధాన ప్రాజెక్టుల్లో కొత్వాల్‌గూడ నుంచి నాచారం వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2 ఒకటి. సుమారు రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారిని నిర్మించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొత్వాల్‌గూడ నుంచి నాచారం మీదుగా నేషనల్ హైవే 167ఎన్ వరకు ఈ రహదారి అనుసంధానం కల్పించనుంది. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) రెండో దశ పనులకు రూ.2,100 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.1,410 కోట్లతో 223 కొత్త, అసంపూర్తి బీటీ రహదారుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కొడంగల్, కోస్గి, మద్దూరులో రూ.41.83 కోట్లతో ఆధునిక బస్టాండ్ల నిర్మాణం, మద్దూరులో రూ.20 కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, మరో రూ.20 కోట్లతో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం ఏర్పాటు చేయనున్నారు.
విద్యారంగంలో రూ.118.80 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, కొడంగల్‌లో రూ.123 కోట్లతో వ్యవసాయ కళాశాల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. రహదారుల అభివృద్ధికి రూ.59.30 కోట్లతో పనులు చేపట్టనున్నారు. తిమ్మారెడ్డిపల్లిలో గురులోక మసంద్ ప్రభు మందిరం అభివృద్ధికి రూ.4.45 కోట్లు, కొడంగల్‌లో నిరంజన్ మఠం అభివృద్ధికి రూ.5.10 కోట్లు కేటాయించారు. హకీంపేట ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.10 కోట్లతో పర్యాటక హోటల్ నిర్మాణం కూడా ప్రతిపాదిత పనుల్లో ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి మొత్తం రూ.9,053.48 కోట్ల అంచనా వ్యయంతో 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, సంబంధిత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు రూ.46.08 కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకున్న 10 ప్రభుత్వ భవనాలను సీఎం ప్రారంభించనున్నారు.
మూడు రోజుల పర్యటనలో చివరి రోజైన నవంబర్ 9వ తేదీన హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఈ సభకు వికారాబాద్, నారాయణపేటతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శన, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.








