- ప్రాణాలకు తెగించి పోరాడిన సిబ్బందికి మంత్రి పొంగులేటి సలాం.
సత్తుపల్లి,మహా.
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను వణికిస్తున్న వేళ.. అధికారుల సమన్వయం, విపత్తు సహాయక బృందాల (ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది) సాహసోపేత చర్యల వల్లే పెను ప్రాణనష్టం తప్పిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. గురువారం సత్తుపల్లి సింగరేణి అతిథి గృహంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో ఆయన వరద సహాయక చర్యలు, నష్టాలపై కీలక సమీక్ష నిర్వహించారు. వరదల్లో ప్రాణాలకు తెగించి మత్స్యకారులను, పౌరులను రక్షించిన సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు.
గత ఆగస్టు మున్నేరు వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి విపత్తు నిర్వహణ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.270 కోట్ల ఖర్చుతో అత్యాధునిక పరికరాలను సమకూర్చడం, 1900 మంది సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లే రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినా 45 నిమిషాల్లో సహాయక బృందాలు చేరుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. సత్తుపల్లి బేతుపల్లి చెరువులో చిక్కుకున్న 8 మంది మత్స్యకారులను రాత్రికి రాత్రే ఆధునిక సాంకేతికత, మొబైల్ లొకేషన్ల సాయంతో సురక్షితంగా రక్షించిన వైనాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ములకలపల్లి సమీపంలో వరద ప్రవాహానికి చెట్టుపై తలదాచుకున్న మహిళను, 20 ఏళ్ల యువకుడిని డ్రోన్ టెక్నాలజీ సాయంతో సిబ్బంది రక్షించిన తీరును ఆయన ప్రశంసించారు.
వరదల వల్ల అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన పంట, రహదారుల నష్టంపై కేవలం ఆఫీసుల్లో కూర్చుని కాకుండా.. అధికారులంతా స్వయంగా గ్రామాల్లో పర్యటించి వాస్తవ నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి ఆదేశించారు. రానున్న రెండు మూడు రోజుల్లోనే సమగ్ర నష్టం నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. వరద విపత్తులో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సహాయక సిబ్బందిలో ఎవరికైనా సొంతిళ్లు లేకపోతే.. వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.








