Mahaa Daily Exclusive

  నెత్తురోడిన పరిషత్ పోరు!

Share

  •  దాడులు, ఘర్షణలు.. భగ్గుమన్న పల్లెలు.
  •  పెట్రోల్ బాంబులు, దొంగ ఓట్లు, బ్యాలెట్ల చించివేత.
  •  ఎన్నికల విధుల్లో మహిళా ఉద్యోగి మృతి.
  •  వర్షం దెబ్బ.. 5 మండలాల్లో వాయిదా.
  •  ఫైనల్‌గా 68 శాతం వరకు పోలింగ్
  •  ఏడో తేదీన తేలనున్న గ్రామీణ అధికారం!

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే పరిషత్ సమరం ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగిన పోలింగ్.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు, ఘర్షణలు, దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలు, పోలీసుల లాఠీచార్జీల నడుమ రణరంగాన్ని తలపించింది. వర్షాలను సైతం లెక్కచేయకుండా బారులు తీరిన ఓటర్లు.. 21,012 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్సుల్లో బంధించారు. అధికార కూటమి బలం, ప్రతిపక్ష వైసీపీ క్షేత్రస్థాయి పట్టుకు గీటురాయిగా మారిన ఈ స్థానిక సమరం.. ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈసారి పరిషత్ పోరు మామూలుగా లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 జడ్పీల పరిధిలో 659 జడ్పీటీసీ, 659 మండలాల పరిధిలో 9,821 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. వీటిలో 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 582 జడ్పీటీసీలకు 2,169 మంది, 7,767 ఎంపీటీసీలకు 18,843 మంది బరిలో నిలిచారు. మరో మూడు ఎంపీటీసీలకు మాత్రం ఎన్నికలు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,61,52,377 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 1,28,76,887, మహిళలు 1,32,74,208, ఇతరులు 1,282 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 3,97,321 మంది అధికంగా ఉండటం ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఈ మహా పోరాటం కోసం ఏకంగా 31,460 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 8,904 సున్నితమైనవి కాగా, 7,160 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు. అక్రమాలను అడ్డుకునేందుకు 16,064 కేంద్రాల్లో సీసీటీవీలు, 6,000 చోట్ల వెబ్‌కాస్టింగ్, 6,507 చోట్ల వీడియోగ్రఫీ ఏర్పాటు చేశారు. ఏకంగా 2.52 లక్షల మంది సిబ్బంది, 40,679 మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు నడుమ ఈ పోలింగ్ సాగింది.

వర్షాలు, రవాణా ఇబ్బందులతో ఉదయం 9 గంటలకు కేవలం 4.80 శాతమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఊపందుకుని 11 గంటలకు 21.12 శాతానికి, మధ్యాహ్నం 3 గంటలకు 58.55 శాతానికి చేరింది. ముఖ్యంగా విశాఖ, పల్నాడు, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఓటర్లు పోటెత్తారు. ఫైనల్‌గా 65 నుంచి 68 శాతం వరకు పోలింగ్ జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. నెల్లూరు జిల్లా ఉదయగిరి, కావలిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వృద్ధులు, దివ్యాంగులు ఓటేయడం విశేషం. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన రాజశేఖర్ చెన్నుపాటి లాంటి ఎంతోమంది ఎన్నారైలు కేవలం ఓటు వేయడానికే సొంతూళ్లకు రావడం గమనార్హం. అయితే భారీ వర్షాలు, వరదల దెబ్బకు ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో, మరో మండలంలోని 2 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక్కడ నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఇదే క్రమంలో అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంటలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ (58) గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు ఆధిపత్య పోరుతో భగ్గుమన్నాయి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం రణరంగాన్ని తలపించింది. లింగాల మండలం పార్నపల్లెలో వైసీపీ ఏజెంట్లను అడ్డుకోవడంతో మొదలైన ఉద్రిక్తత, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకునే దాకా వెళ్లింది. పులివెందుల మండలం ఎర్రిపల్లెలో అయితే ఏకంగా పోలింగ్ బూత్ సమీపంలోనే పెట్రోల్ బాంబులు విసిరి భయభ్రాంతులకు గురిచేశారు. జమ్మలమడుగు గుండ్లకుంటలో టీడీపీ-వైసీపీ ఏజెంట్ల ఫైటింగ్ తారాస్థాయికి చేరగా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భార్య ఏకంగా ఎన్నికల సిబ్బందితోనే వాగ్వాదానికి దిగారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం లక్ష్మిరెడ్డిపల్లిలో అక్రమార్కులు బ్యాలెట్ బాక్సులనే బయటపడేశారు.

ఇక కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ పరిస్థితులు అదుపు తప్పాయి. మండ్లెం పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్లను అడ్డుకోవడంతో వారు నిరసనకు దిగారు. ఉద్రిక్తతల నడుమ ముచ్చుమర్రిలో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని, కర్నూలులో శిల్పా రవి, శిల్పా చక్రపాణిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోసిగి మండలం ఆర్లబండ బూత్-2లో రిగ్గింగ్ ఆరోపణలతో ఏకంగా పోలింగ్ నిలిచిపోయింది. అత్యంత విచిత్రంగా కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ వర్గాలే రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో దాదాపు 20 మంది రక్తమోడారు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనూ మంటలు రేగాయి. కుప్పం నడుమూరులో వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ అభ్యర్థి గాయపడగా.. శాంతిపురం మండలం కడపల్లిలో ఆందోళనకారులు రోడ్డెక్కడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అనంతపురం జిల్లా మరుట్లలో రిగ్గింగ్ ఆరోపణలతో బ్యాలెట్ బాక్సును బయటకు లాక్కొచ్చి పత్రాలు చించివేస్తే, కూడేరులో పోలీసులతో కార్యకర్తల తోపులాట జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలగరలో రెండు వర్గాల ఘర్షణకు పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. తిరుపతి సాయినగర్‌లో దొంగ ఓట్ల వ్యవహారంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడగా, కాకినాడ మంగితుర్తిలో ప్రచారంపై ఘర్షణ చెలరేగింది. మీడియాపైనా దాడులు ఆగలేదు. చిత్తూరు జిల్లా వీకోటలో ఓటు వేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్‌ను సీఐ అడ్డుకుని బయటకు గెంటేశారు. లింగాలలో సాక్షి విలేకరిపై దాడి చేసి ఫోన్ పగులగొట్టారు.

ఈ దారుణాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అధికార పార్టీ మొత్తం ఎన్నికల ప్రక్రియను ‘కబ్జా’ చేసిందని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని గర్జించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు.. కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు అంతా ఒక సిండికేట్‌గా మారి అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం నుంచి.. పోలింగ్ బూతుల్లోకి చొరబడి రిగ్గింగ్ చేసేదాకా అరాచకం సృష్టించారని మండిపడ్డారు.

పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. అక్రమాలు జరిగిన చోట నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక అసలు క్లైమాక్స్ నవంబర్ 7వ తేదీన ఉదయం 8 గంటలకు మొదలుకానుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 లెక్కింపు కేంద్రాల్లో, 9,062 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఫలితాల ఆధారంగానే నవంబర్ 11, 12 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. మరి ఈ రక్తమోడిన కురుక్షేత్రంలో పల్లె ప్రజలు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే ఏడో తేదీ దాకా ఆగాల్సిందే!