Mahaa Daily Exclusive

  బీసీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.

Share

  •  ఆత్మగౌరవ భవనాలకు నిధుల వరద.

హైదరాబాద్, మహా.

తెలంగాణలో వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లో 38 బీసీ కుల సంఘాల ‘ఆత్మగౌరవ భవనాల’ నిర్మాణం కోసం రూ.88.50 కోట్లను మంజూరు చేస్తూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నిధులకు సంబంధించిన జీవో కాపీలను ఆయా కుల సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. అన్ని కులాల సామాజిక, సాంస్కృతిక, విద్యాభివృద్ధి లక్ష్యంగా ఈ భవనాల నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

గతంలో భూములు కేటాయించినప్పటికీ కొన్ని పరిపాలనా, సాంకేతిక సమస్యల వల్ల పనులు ముందుకు సాగలేదని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు హెచ్ఎండీఏ సహకారంతో ఆ అడ్డంకులన్నీ తొలగించామని, స్థలాలను ‘రెడీ-టు-కన్‌స్ట్రక్ట్’ పద్ధతిలో సిద్ధం చేశామని తెలిపారు. ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసినందున, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘాలు తక్షణమే నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. భవనాల నిర్మాణాలకు కావాల్సిన అన్ని అనుమతులను ఇంజనీరింగ్ విభాగం, హెచ్‌ఎండీఏ సమన్వయంతో ‘సింగిల్ విండో’ విధానంలో వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

సరిగ్గా ఏడాదిలోగా ఈ భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి, వాటిని బీసీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ కుండబద్దలు కొట్టారు. బీసీ సంఘాలకు కేటాయించిన ప్లాట్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ జరుగుతున్న దుష్ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఆ భూములు బలహీన వర్గాల ఆస్తులని, వాటిని ఏ ప్రభుత్వమూ వెనక్కి తీసుకోదని భరోసా ఇచ్చారు. కేటాయించిన నిధులతో నిర్ణీత సమయంలో భవనాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయా సంఘాలపైనే ఉందని, ఒకవేళ నిర్మాణాల్లో జాప్యం జరిగితే మాత్రం సంఘాల ప్రతినిధులదే బాధ్యత అని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, అన్ని బీసీ కుల సంఘాలు సమావేశాలు, జయంతులు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లో ఐదు ఎకరాల స్థలంలో ఒక సమగ్ర ‘బీసీ భవన్’ను నిర్మించే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.