Mahaa Daily Exclusive

  ‘ఆర్ఆర్ ట్యాక్స్’ ఉంటే బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?

Share

  •  మోదీ, అమిత్ షాలకు కేటీఆర్ సూటి ప్రశ్న!

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ‘ఆర్ఆర్ ట్యాక్స్’ (రాహుల్-రేవంత్ ట్యాక్స్) వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్యాక్స్ వసూలు చేస్తోందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పదేపదే ఆరోపిస్తున్నారని.. మరి ఆ ఆరోపణలు నిజమే అయితే, కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ఏ బిల్డర్ లేదా డెవలపర్‌ను అడిగినా ఈ ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వ్యవహారం గురించి చెబుతారని కేటీఆర్ అన్నారు. చదరపు అడుగుకు ఏకంగా రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పుడు, ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి ఈ ట్యాక్స్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మోదీ, అమిత్ షా బహిరంగ సభల్లో ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ వారు ఈ అంశంపై విమర్శలు చేయడం తప్ప, ఆ వసూళ్లను అరికట్టేందుకు గానీ, విచారణ జరిపేందుకు గానీ ఎలాంటి చొరవ చూపడం లేదని కేటీఆర్ విమర్శించారు. దీన్నిబట్టి చూస్తే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయికారీ అవగాహన ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు.