- పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్ పీ) ని ప్రకటించిన విజయసాయిరెడ్డి
- వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికేందుకే కొత్త పార్టీ
- రెండు కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలకడమే లక్ష్యం
- యువతనే సీఎం ను చేస్తానని వెల్లడి
విజయవాడ, మహా : పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్ పీ) పేరుతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. పీఆర్పీ ద్వారా యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో యువతనే ముఖ్యమంత్రి స్థానానికి తీసుకొస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కావాలని కోరుకోవడం లేదని, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్పష్టమైన రాజకీయ శూన్యత ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ రాజకీయ తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని భావించి పీఆర్పీని స్థాపించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో రెండు పార్టీలు, రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏపీని కేవలం రెండు కుటుంబాలే పాలించాలా? అని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి కొత్త తరానికి నాయకత్వ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. యువత రాజకీయాల్లోకి రావాలని, నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో యువతను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. తాను మాత్రం సీఎం పదవిని ఆశించడం లేదని స్పష్టం చేశారు. దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయాలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా పీఆర్పీని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాగలమన్నది రాబోయే రోజుల్లో తమ కార్యాచరణ ద్వారా చూపిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
చెప్పుడు మాటలు విని జగన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు
వైసీపీలో తాను తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నానని మాజీ ఎంపీ, పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) అధినేత విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడలో తన పార్టీని ప్రకటించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వైసీపీని స్వచ్ఛందంగా వీడలేదని, తనను అవమానించి బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపించారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్న సమయంలో తాను 70కి పైగా అవమానాలను భరించానని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మనిషి తట్టుకోలేని రీతిలో అక్కడ అవమానాలు జరిగాయని, ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట ఎవరూ ఉండలేరని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ కొందరి చెప్పుడు మాటలు విని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన తనను చివరకు అవమానకర రీతిలో బయటకు నెట్టారని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కీలక వ్యక్తులు, నాయకులు తమ కొత్త పార్టీలోకి చేరుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.








