- గోవా బీచ్ కు గ్లోబల్ గుర్తింపు
- ఆసియాలోన టాప్ ప్లేస్
- ప్రపంచంలోని టాప్ 25 బీచ్‌లలో గోవా పలోలెం బీచ్!
పనాజీ, మహా : ఇండియాలోని పర్యాటక ప్రదేశాల జాబితాలో గోవాకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. అందమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలతో దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే గోవాకు ఇప్పుడు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దక్షిణ గోవాలోని పలోలెం బీచ్ ఆసియాలోనే అత్యుత్తమ బీచ్‌గా నిలిచింది. అంతేకాదు.. ప్రపంచంలోని టాప్ 25 బీచ్‌ల జాబితాలో ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. బీచ్.కామ్ విడుదల చేసిన గ్లోబల్ బీచ్ ఇండెక్స్ 2026లో ఈ ఘనత సాధించింది. దీంతో అంతర్జాతీయ పర్యాటక రంగంలో గోవా మరోసారి ప్రత్యేకంగా నిలిచింది.
ఈ ర్యాంకింగ్‌లో పలోలెం బీచ్ సాధించిన స్థానం ఇప్పుడు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నిపుణుల సూచనలు, పర్యాటకుల అభిప్రాయాలు, నీటి రంగు, స్పష్టత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. ముఖ్యంగా నాసా ఉపగ్రహ డేటాను కూడా విశ్లేషణలో ఉపయోగించడం విశేషం. దక్షిణ గోవాలోని కనకోనా ప్రాంతంలో ఉన్న పలోలెం బీచ్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అర్ధచంద్రాకారంలో విస్తరించిన ఇసుక తీరం, స్వచ్ఛమైన తెల్లని ఇసుక, ప్రశాంతంగా కనిపించే సముద్రపు నీరు ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణలు. తీరమంతా విస్తరించిన కొబ్బరి చెట్లు, చుట్టూ కనిపించే పచ్చదనం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి. గోవాలోని ఇతర ప్రముఖ బీచ్‌లతో పోలిస్తే పలోలెం ప్రత్యేకత దాని ప్రశాంతమైన వాతావరణం. నిత్యం సందడిగా ఉండే పర్యాటక ప్రాంతాలకు భిన్నంగా.. ఇక్కడ సముద్రం ఒడ్డున ప్రశాంతంగా గడపవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి, ఒత్తిడికి దూరంగా కొంత సమయం గడపాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
సాహస ప్రియులకూ నచ్చే పర్యాటక ప్రాంతం
పలోలెం బీచ్ కేవలం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే కాదు.. సాహస కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్యాటకులు కయాకింగ్ చేస్తూ సముద్ర అందాలను ఆస్వాదించవచ్చు. అలాగే డాల్ఫిన్లను దగ్గరగా చూసేందుకు బోట్ రైడ్స్ అందుబాటులో ఉంటాయి. సమీపంలోని మంకీ ఐలాండ్ సందర్శన కూడా పర్యాటకులకు మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక సంగీత ప్రియులను ఆకట్టుకునే సైలెంట్ పార్టీలకు కూడా పలోలెం ప్రసిద్ధి. సాధారణ పార్టీల్లో మాదిరిగా భారీ సౌండ్ సిస్టమ్‌లు కాకుండా.. ప్రత్యేక హెడ్ఫోన్ల ద్వారా సంగీతాన్ని వింటూ సందర్శకులు డ్యాన్స్ చేస్తుంటారు. వీటితో పాటు యోగా కేంద్రాలు, బీచ్ కేఫ్‌లు, వెల్నెస్ రిట్రీట్లు ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి.
పలోలెం బీచ్‌ను ఎప్పుడు సందర్శించాలి?
పలోలెం బీచ్ సందర్శనకు నవంబర్ నుంచి మార్చి వరకు ఉండే కాలం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు బీచ్ కార్యకలాపాలు, బోటింగ్, ఇతర పర్యాటక అనుభవాలను ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో హోటళ్లు, రిసార్టులు త్వరగా నిండిపోయే అవకాశం ఉంది. అందుకే ముందుగానే వసతి, ప్రయాణ టికెట్లను బుక్ చేసుకోవడం మంచిది.
322 బీచ్‌లను విశ్లేషించి ర్యాంకింగ్
బీచ్.కామ్ రూపొందించిన గ్లోబల్ బీచ్ ఇండెక్స్ 2026 కోసం ప్రపంచవ్యాప్తంగా 322 బీచ్‌లను పరిశీలించారు. 58 మంది నిపుణులు చేసిన నామినేషన్లతో పాటు మొత్తం 18 విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. నీటి నాణ్యత, సముద్రపు స్పష్టత, బీచ్‌ల ప్రజాదరణ, చేరుకోవడానికి ఉన్న సౌకర్యాలు, వాతావరణ పరిస్థితులు, సందర్శకుల అభిప్రాయాలు వంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్‌లను సిద్ధం చేశారు. ఇందుకోసం నాసా ఉపగ్రహాల నుంచి సేకరించిన నీటి రంగు, స్పష్టతకు సంబంధించిన డేటాతో పాటు వాతావరణ సమాచారాన్ని విశ్లేషించారు. అంతేకాదు.. 93,000కు పైగా గూగుల్ మ్యాప్స్ సమీక్షల నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు. ఈ విశ్లేషణలో పలోలెం బీచ్ ఆసియాలో అగ్రస్థానాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఈ గుర్తింపు గోవా పర్యాటక రంగానికి మరింత ప్రాచుర్యం తీసుకురావడమే కాకుండా.. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంలోనూ కీలకంగా మారనుంది.







