Mahaa Daily Exclusive

  అమిత్ షా విశాఖ పర్యటన రద్దు…

Share

  • అమిత్ షా విశాఖ పర్యటన రద్దు
  • చివరి నిమిషంలో మారిన షెడ్యూల్‌!
  • సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌కు హాజరుకాని కేంద్ర హోంమంత్రి
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న పీయూష్‌ గోయల్‌

విశాఖపట్నం, మహా : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విశాఖ పర్యటన రద్దయింది. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవానికి ఆయన హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో పర్యటన రద్దయింది. అనివార్య కారణాలతో అమిత్‌ షా పర్యటనను రద్దు చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో సమ్మిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం అమిత్‌ షా బుధవారం రాత్రి విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగా విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. గురువారం జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉండగా, అనూహ్యంగా ఆయన పర్యటన రద్దయింది. ఈ పరిణామంతో అధికారులు కార్యక్రమ షెడ్యూల్‌లో మార్పులు చేశారు.

అమిత్‌ షా పర్యటన రద్దు కావడంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమ్మిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా కాకుండా, తాజా పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాన్ని కొనసాగించారు. షెడ్యూల్‌ ప్రకారం అమిత్‌ షా సమ్మిట్‌లో సుమారు రెండు గంటలపాటు పాల్గొనాల్సి ఉంది. అనంతరం గురువారం మధ్యాహ్నం నిర్వహించనున్న ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌ను ప్రారంభించాల్సి ఉంది. మహిళా అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన అంశాలపై జరిగే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అమిత్‌ షా పర్యటనలో భాగంగా హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పర్యటన రద్దుతో ఈ సమావేశం ఉంటుందా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చివరి నిమిషంలో కేంద్ర హోంమంత్రి పర్యటన రద్దు కావడం, సీఐఐ సమ్మిట్‌ కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.