కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓ నివేదికను విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ‘రియల్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ 2025’ పేరిట నివేదికను పార్టీ విడుదల చేసింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావించింది. మాజీ ఎంపీ రాజీవ్ గౌడ, ఆయన బృందం రూపొందించిన ఈ నివేదికను పార్టీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యువతకు తగిన ఉద్యోగావకాశాలు లేవని, ద్రవ్యోల్బణం పెరగుతోందని చిదంబరం వ్యాఖ్యానించారు. ఆదాయంలో అసమానతలు పెరుగుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. దాన్ని మనం తిరస్కరించలేం. దీన్ని మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టవచ్చు. గతేడాదితో పోలిస్తే వృద్ధి మరింత క్షీణించవచ్చు’’ అని ఆయన అన్నారు. ఖాళీ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారని, కొత్తగా ఉద్యోగ సృష్టి జరగడం లేదని పేర్కొన్నారు. ‘‘ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉంది. 2- 3 ఏళ్ల నుంచి ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. ఆదాయం అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ధనికులు, పేదల మధ్య అంతరం పెరుగుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టలేదు’’ అని చిదంబరం విమర్శించారు. దేశ వాస్తవ ఆర్థిక స్థితిని తెలియజేసే ఉద్దేశంతోనే ఈ నివేదికను రూపొంచినట్లు చిదంబరం చెప్పారు.







