సీనియర్ ఐపీఎస్ అధికారి, ఫైర్ సర్వీసులు, విపత్తుల నిర్వహణ విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. గతంలో ఆయనపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. వాటిపై దర్యాప్తు కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సునీల్ కుమార్‌పై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. ఆయనకు పోస్టింగ్ లభించలేదు. ప్రస్తుతం ఆయన వెయిటింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొంతకాలం పాటు పీవీ సునీల్ కుమార్ సీఐడీ డీజీగా పని చేసిన విషయం తెలిసిందే. ఆయన సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడే గతంలో ఎంపీ, ప్రస్తుతం డిప్యటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ రఘురామ తాజాగా ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ పేరు సైతం చేర్చారు. తనను అక్రమంగా అరెస్టు చేసి వేధించారని, అయిదుమంది గుర్తు తెలియని వ్యక్తులతో హింసించారంటూ అప్పట్లో రఘురామ కృష్ణంరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. తనను కొడుతున్నారనడానికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా తీశారని, దాన్ని వైఎస్ జగన్‌కు చూపించారని రఘురామ ఆరోపించారు. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేశారని చెప్పారు. పోలీసులకు రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచిన అంశాలపై ఇది వరకు పీవీ సునీల్ కుమార్ స్పందించారు కూడా. ఈ కేసు అప్పట్లో సుప్రీంకోర్టులో మూడు సంవత్సరాల పాటు నడిచిందని గుర్తు చేశారు. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానమే దీన్ని తిరస్కరించిందని, అలాంటి కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఏమనాలో తనకు తెలియట్లేదని వ్యాఖ్యానించారు.







