నూనె గింజల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగిందని, సమయానికి రైతుబంధు తో పాటు సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించామని హరీష్ రావు పేర్కొన్నారు. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు (సన్ ఫ్లవర్) పంట కోతకు వచ్చింది. సన్ ఫ్లవర్ గింజలను విక్రయించడానికి ఇప్పటిదాకా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు.
సన్ ఫ్లవర్ మద్ధతు ధరను నాఫెడ్ రూ. 7280 గా ప్రకటించగా, కనుగోలు కేంద్రాలు లేని కారణంగా రైతులు రూ. 5,500 నుంచి రూ. 6000 వరకు దళారులకు క్వింటాల్ చొప్పున విక్రయిస్తున్నారన్నారు. ఇప్పటిదాకా కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులకు విక్రయించడం వల్ల క్వింటాల్ కు రూ. 1000 నుండి రూ. 2000 వరకు నష్టాన్ని చవిచూడాల్సిన దుస్థితి రైతులకు కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా తెలంగాణ వ్యవసాయం తిరోగమన దిశలో పయనిస్తుందన్నారు. నూనె పంటలు వేయాలంటేనే రైతులు ఆందోళన చెందే పరిస్థితులను ప్రబుత్వం కల్పించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.







