బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను అన్ని పార్టీ పదవుల నుంచి తప్పించారు. తాను జీవించినంత కాలం పార్టీలో తనకు రాజకీయ వారసుడు ఉండరని ప్రకటించారు. లఖ్‌నవూలో ఆదివారం జరిగిన బీఎస్పీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ సమన్వయకర్తలుగా ఇద్దరు
అలాగే పార్టీ నాయకత్వంలో గణనీయమైన మార్పులను చేపట్టారు మాయావతి. తన సోదరుడు ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రామ్ జీ గౌతమ్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమించారు. వీరు దేశవ్యాప్తంగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని మాయావతి పేర్కొన్నారు. అలాగే తన రాజకీయ వారసత్వంపై కూడా మాయావతి స్పష్టమైన ప్రకటన చేశారు. తాను బతికున్నంత వరకూ పార్టీకి తన రాజకీయ వారసుండంటూ ఎవరూ ఉండబోరని స్పష్టం చేశారు. తనకు పార్టీ, ఉద్యమం ముఖ్యమని తెలిపారు. ఆ తర్వాతే బంధుత్వాలు అని నొక్కి చెప్పారు. “పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్‌ను బీఎస్పీ నుంచి బహిష్కరించాను. ఉత్తర్‌ప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా పార్టీని రెండు వర్గాలుగా విభజించడం ద్వారా ఆయన పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నించారు. ఇది భరించలేని చర్య. అశోక్ సిద్ధార్థ్ కుమార్తెను ఆకాశ్ ఆనంద్ వివాహం చేసుకున్నాడు. అశోక్ సిద్ధార్థ్ కుమార్తె ప్రభావం ఆకాశ్‌పై ఉంది. అది అంత సానుకూలంగా లేదు. అటువంటి పరిస్థితిలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నా. అందుకు ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థే కారణం. ఇప్పుడు ఆకాశ్ స్థానంలో పార్టీ సమన్వయకర్తగా ఆనంద్ కూమార్ ఉంటారు. ఇప్పటివరకు ఆయన నన్ను ఏ విషయంలోనూ నిరాశపరచలేదు. పార్టీకి, ఉద్యమానికి ఎటువంటి హాని కలిగించలేదు.” అని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆనంద్ మామపై గతంలో వేటు
అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆకాశ్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్, బీఎస్పీ మేరఠ్ ఇన్ ఛార్జ్ నితిన్ సింగ్ ను పార్టీ నుంచి మాయామతి గత నెలలో వేటు వేశారు. నితిన్ సింగ్ ఇటీవల వరకు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేవారు. తన మామ సిద్ధార్థ్ పై వేటు పడిన నెల రోజుల్లో ఆనంద్‌ను కూడా కీలక పదవుల నుంచి తప్పించడం గమనార్హం.
మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ ఆనంద్ 2016లో బీఎస్పీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తన రాజకీయ వారసుడిగా ఆకాశ్ పేరును మాయావతి ప్రకటించారు. ఆ తర్వాత జులైలో మళ్లీ పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. తాజాగా ఆనంద్ పై వేటు పడింది. కాగా, ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుంచి మాయవతి తప్పించడం ఇది రెండోసారి.







