ఎస్ ఎల్ బిసి ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోవడానికి కేసీఆర్ కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు చలాకీ కాల్చి వాత పెట్టాలని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఇక్కడి రాజకీయాలను కలుషితం చేశారని అన్నారు..ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ నీటి ప్రాజెక్టులను కట్టిందని అన్నారు. వనపర్తిలో ధన రాజకీయం, కక్ష రాజకీయాలు ఉండేవి కావని రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు కీర్తి తెచ్చే విధంగా పని చేస్తానని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఏకమై రైతులను మభ్యపెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు . రూ. 21కోట్ల రుణమాఫీ జరిగిందా లేదా రైతులను అడగాలని అన్నారు. రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో వేశామని.. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆడబిడ్దలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని అన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు .
కేసీఆర్ గ్రహణంతో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం
కేసీఆర్ గ్రహణం పట్టి డ్వాక్రా సంఘాలు నిర్వీర్యమయ్యని.. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం అన్నారు. బీఆర్ఎస్,బీజేపీ పార్టీలు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయని అన్నారు. డ్వాక్రా సంఘాలకు శిల్పారామంలో మూడున్నర ఎకరాలు ఇచ్చామని.. 150 షాపులలో అక్కడ డ్వాక్రా మహిళల ఉత్పత్తులు విక్రయిస్తున్నారని అన్నారు. మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఆడబిడ్డలకు 4 లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశామని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఏడాదిలో 55 వేల 163 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. ఎన్నో పనులు చేసిన తనను నువ్వు దిగుతావా లేదా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేసీఆర్ ఏనాడైనా పాలమూరు గురించి పట్టించుకున్నారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు .
. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోఎస్ ఎల్ బిసి పనులు ఆగిపోవడం వల్లే టన్నెల్ కుప్పకూలిందని ఆరోపించారు. సొరంగంలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే మరో 15..20 ఏళ్లు సీఎంగా..
ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రేవంత్‌రెడ్డి మరో 15.. 20ఏళ్లు సీఎంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే .. తమ బతుకు బస్టాండ్ అవుతుందని బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు భయపడుతున్నారు. పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పండ బెట్టారని బీఆర్ఎస్ నేతలను అడుగుతున్నా. కృష్ణా జలాలను ఏపీ సర్కారు రాయలసీమకు కొల్లగొట్టుకు పోతుందంటే అందుకు కారణం కేసీఆర్. 811 టీఎంసీల్లో 511 టీఎంసీలు ఆంధ్రాకు తీసుకెళ్లండని కేసీఆర్ సంతకం పెట్టారు. ఆ సంతకమే ఇవాళ తెలంగాణ రైతాంగానికి శాపంగా మారింది. ఎస్‌ఎల్‌బీసీ పాపాల భైరవుడు కేసీఆర్ కాదా? పదేళ్లు భారాస పాలనలో ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగిపోవడం వల్లే కుప్పకూలింది. టన్నెల్‌లో 8మంది ప్రాణాలు పోవడానికి కారణం కేసీఆర్. కేసీఆర్‌ను నమ్మినందుకే పాలమూరు పడావు పడింది. అప్పుడే నన్ను దిగు..దిగు అని కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అంటున్నారు. పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే చూసి ఓర్వలేరా? కేసీఆర్.. మీరు ఏలడానికి పుడితే.. మేం బిచ్చమెత్తుకునేందుకు పుట్టామా? పాలమూరు ప్రజలకు తెలివితేటలు లేవా? మీ మాదిరిగా మేం చదువుకోలేదా?
కిషన్‌రెడ్డి సైంధవుడిలా అడ్డు పడుతున్నారు
మామునూరు ఎయిర్ పోర్టు ప్రధాని మోదీ ఇచ్చారు.. నేనే తెచ్చానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారు. అదే నిజమైతే.. మెట్రో రాలేదు, ఆపింది మోదీనే కదా? మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు.. ఆపింది మోదీనే కదా?. రీజినల్‌రింగ్ రోడ్డు ఉత్తరభాగం నేనే తెచ్చానని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. దక్షిణ భాగం ఆగిపోయింది. ఆపింది మీరే కదా? పాలమూరు రంగారెడ్డికి 60 టీఎంసీల నీటి కేటాయింపులు పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఆపింది మీరు కాదా? వస్తేనేమో ఆయన ఖాతాలో రాసుకుంటారు.. రాకపోతేనే రేవంత్‌రెడ్డి ఏం చేయలేదంటారు. సికింద్రాబాద్‌లో వరద బాధితులకు కిషన్‌రెడ్డి ఏం చేశారు. నా కంటే చిన్నోడు రాష్ట్రానికి సీఎం అయ్యిండని కిషన్‌రెడ్డికి కడుపుమంట. కిషన్‌రెడ్డీ.. మీ దగ్గర మోదీ, ఈడీ, సీబీఐ ఉండొచ్చు. ఎంతకాలం ఈడీ, సీబీఐని చూపించి బెదిరిస్తారు? మేం ఎవరికీ భయపడం. మోదీ మనకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. మోదీ చేయాలనుకున్నా.. కిషన్‌రెడ్డి సైంధవుడిలా అడ్డు పడుతున్నారు. తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్‌రెడ్డి బాధపడుతున్నారు.’’ అని సీఎం ప్రశ్నించారు.
రూ.550 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రూ.550 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం,మండలాల్లో రూ. 40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు, నూతన ప్రభుత్వ ఆసుపత్రి భావన నిర్మాణానికి రూ.203.95 కోట్లతో,నూతన ఐటీ టవర్ భవన నిర్మాణానికి 22 కోట్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలకు రూ. 47.50 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు, 30 పడకల ఆస్పత్రి భావనము (పెబ్బేర్) నిర్మాణపు పనులకు రూ. 11.20 కోట్లు, శ్రీరంగాపూర్ ఆలయానికి పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు 1.5 కోట్లు, వనపర్తి నియోజకవర్గంలో గిరిజన ఆవాసాల అభివృద్ధి పనులకు రూ. 22.67 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ముఖ్య మంత్రి శంకుస్థాపనలు చేశారు. దీనితోపాటు కాసిం నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సమగ్ర సర్వే పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, జిల్లా ఇన్చార్జి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, వివిధ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు,జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు._







