రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
భూభారతి చట్టం-2025 ద్వారా రైతు సమస్యల పరిష్కారం లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్, తలకొండపల్లి మండలాలలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం-2025 పై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కల్వకుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలు రైతుల సమస్యల పరిష్కారానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. భూమి అనేది ఒక రైతు జీవితానికి చాలా పెద్ద ఆధారమని, ముఖ్యంగా భూభారతి చట్టంలో అప్పిలు వ్యవస్థ చాలా కీలకమైనదని అన్నారు. రైతుకు అన్యాయం జరిగితే అప్పీల్ చేసుకోవడం ద్వారా న్యాయాన్ని పొందవచ్చని, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, సి సి ఎల్ ఎ స్థాయిలలో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాలలో చాలా వరకు భూమి హద్దుల గొడవలు ఉంటాయని, కానీ భూభారతిలో రీ సర్వే, కొనుగోలు, పాలు పంపకాలు, దాన దస్తావేజులు, విరాసత్ పట్టా మార్పిడికి తప్పనిసరిగా కమతం జతపరచడం వల్ల భవిష్యత్తులో భూ గొడవలు ఉండవని తెలిపారు. భూభారతి చట్టంలో బాధితులకు న్యాయ సలహా వ్యవస్థ ఉందని, గతంలో గ్రామాలలో గ్రామ పరిపాలన, విఆర్ఓ/వి.ఆర్.ఏ వ్యవస్థ ఉండేవని, వాటిని తొలగించడం ద్వారా గ్రామాలలో సమస్యలపై సమాచారం లేదని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన వారిని గ్రామ పాలన అధికారి, మండల సర్వేయర్లను నియమించడం జరుగుతుందని, విరాసత్ మార్పిడికి వారసులకు అందరికీ నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఈ నూతన చట్టంలో ఉందని, గతంలో ధరణి చట్టంలో ఈ అవకాశం లేదని తెలిపారు. ప్రతి రైతు భూభారతి చట్టంలోని అంశాలను అవగాహన చేసుకోవాలని తెలిపారు. జూన్ లో ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో రెవెన్యూ అధికారులతో నిర్వహించడం జరుగుతదనీ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్క రైతు భూ పొరపాట్లను పరిష్కరించుకోవాలని, అందరూ సహకరించాలని అన్నారు. కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ధరణి చట్టంలో భూమి విషయాలలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగేవని, ఇప్పుడు అలాంటి సమస్య ఉండదని, ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సాదా బైనమాల ప్రకారం కొనుగోలు చేసిన భూములకు పరిష్కారం లభిస్తుందని, పార్ట్-బి లో ఉన్న భూములకు పరిష్కారం లభించి వారికి పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. భూభారతిలో రైతు తన సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నో అవకాశాలు ప్రవేశ పెట్టడం జరిగిందని, చట్టంలోని అంశాలు, హక్కులపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కడ్తాల్, తలకొండపల్లి అవగాహన సదస్సులలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, కడ్తాల్, తలకొండపల్లి తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.







