వెంకటాపురం మహా:
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం జక్కుల వారి వీధికి చెందిన వాసం రవి కిరణ్ ఈనెల 24వ తేదీన తప్పి పోగా మంగళవారం మృతదేహం లభ్యమయింది. మిషన్ భగీరథలో తాత్కాలిక పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వాసం రవి కిరణ్ తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత మంగళవారం వెంకటాపురం నుండి రాచపల్లి, మల్లాపురం వెళ్లే రహదారి ప్రక్కన విగత జీవిగా పడి ఉన్నాడు. మృతదేహం బాగా దెబ్బతిన్నట్లు సమాచారం. పోలీసుల సమాచారం ప్రకారం ఈనెల 24వ తేదీన మిషన్ భగీరథ నీరు వదలడానికి మోటార్ సైకిల్ తీసుకొని వెళ్లిన అతను తిరిగి రాలేదని అతని తల్లి వాసం సాలమ్మ అన్నిచోట్ల వెతికినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఆమె 25 తేదీన పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని. వడదెబ్బకు గురై అస్వస్థత కలిగి వి.ఆర్.కె పురం గ్రామ శివారులోని పాలెం ప్రాజెక్టు కాలువ సమీపంలో పడిపోగా, అది నిర్మానుష్య ప్రదేశమై ఎవరూ చూడకపోవడంతో మృతుడు చనిపోయినట్లుగా తెలుస్తుంది. అతని మృతదేహాన్ని మృతుని తల్లి వాసం సాలమ్మ గుర్తించగా ఆమె ఇచ్చిన వాంగ్మూలం మేరకు దర్యాప్తు కొనసాగుతున్నదనీ ఎస్సై తిరుపతి రావు మీడియాకు తెలిపారు.







