ఖమ్మం – మహా.
ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ‘నగర కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశం తీవ్ర రాజకీయ ఆరోపణలకు వేదిక అయింది. పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ విజయంపై ఆనందం వ్యక్తం చేయడమే కాక, కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
పగడాల నాగరాజు మాట్లాడుతూ, ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ సభకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, “జై తెలంగాణ” నినాదాలతో సభ ప్రాంగణాన్ని మార్మోగించినట్టు చెప్పారు. సభ విజయాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంక్వయిరీల పేరుతో ప్రజలను బెదిరించి సభకు రాకుండా చూసే ప్రయత్నాలు చేసినట్టు ఆరోపించారు. అయినా కూడా ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు లోనవకుండా, ఉత్సాహంగా పాల్గొనడం తమ పార్టీకి వచ్చిన ప్రజాధారాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు:
పగడాల నాగరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. ఖమ్మం నియోజకవర్గానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి పాలనలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టులను గుర్తు చేస్తూ – సస్పెన్షన్ బ్రిడ్జి, మున్నేరు కాంక్రీట్ వాల్, నాలుగు లైన్ల రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో నెట్టేశిందని ఆరోపించారు.
మున్సిపల్ అభివృద్ధికి అడ్డుకట్ట:
డివిజన్ల అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియతతో నిలిపివేసిందని ఆరోపించారు. డివిజన్లలో కార్పొరేటర్లు తరచూ రిప్రజెంటేషన్లు ఇచ్చినా, ఒక్క పనికూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. మున్నేరు సీసీ వాల్ నిర్మాణంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయకుండా, పనికిరాని ప్లాట్లు ఇచ్చి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
కార్పొరేటర్ల బహిరంగ సవాల్:
ఈ సమావేశంలో కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, మక్బుల్, తాజుద్దీన్, బుర్రి వెంకట్, జ్యోతి రెడ్డి, భోజడ్ల రామ్మోహన్, ఎచ్చు ప్రసాద్, ఆరెంపుల వీరభద్రం, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత మురళి వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆయనకు బీఆర్ఎస్ నాయకులపై విమర్శ చేసే స్థాయి లేదని ధ్వజమెత్తారు.
బి ఆర్ ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచిన నువ్వు ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి,” అంటూ కార్పొరేటర్లు మురళికి సవాల్ విసిరారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో ఓడిన చరిత్రను గుర్తు చేస్తూ, “ప్రజలు ఎవరి సేవలు గుర్తుపెట్టుకుంటారో ఎంచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసినట్లే మురళి కూడా పార్టీకి మాయం చేస్తున్నాడు” అని మండిపడ్డారు.







