వరంగల్, మహా;
వరంగల్ తూర్పు రాజకీయాల్లో ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల ఓ వేడుకల్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొండా దంపతుల పై బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును ‘పిచ్చాసుపత్రిలో చేర్చాలి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రదీప్ రావు విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
‘ఎర్రబల్లులు’ వ్యాఖ్యలపై ప్రదీప్ రావు ఆగ్రహం
“ఎర్రబెల్లి ఇంట్లో పుట్టిన వారందరూ ఎర్ర బల్లులు” అంటూ ఇటీవల కొండా మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలపై ప్రదీప్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొండా మురళికి పిచ్చి పట్టిందని ఆయనను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉంది” అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. గతంలో కొండా దంపతులు మహిళలను, మైనార్టీ నాయకులను దూషించిన ఘటనలను ప్రదీప్ రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. “ఎర్రబెల్లి కుటుంబ సభ్యులు వ్యక్తిగత విమర్శలు, బూతుల జోలికి పోరని అది మా సంస్కృతి కాదు” అని ప్రదీప్ రావు ఘాటుగా సమాధానా మిచ్చారు.
పదవుల కోసం ప్రాకులాట?
కొండా మురళి రాజకీయ ఎదుగుదల పై ప్రదీప్ రావు సూటి ప్రశ్నలు సంధించారు. “నాడు రాజశేఖర్ రెడ్డి సహకారంతో మంత్రి పదవి తెచ్చుకున్నది వాస్తవం కాదా? కేసీఆర్ కాళ్లు పట్టుకొని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు పొందింది నిజం కాదా? నేడు రేవంత్ రెడ్డి భిక్షతోనే మంత్రి పదవి తెచ్చుకున్నది నిజం కాదా?” అంటూ ప్రదీప్ రావు కొండా మురళి పై ధ్వజమెత్తారు. రెడ్డి సామాజిక వర్గం సహకారంతో ఎదిగి, ఇప్పుడు అదే వర్గాన్ని బండబూతులు తిట్టడం కొండా మురళి ద్వంద్వ నీతికి నిదర్శనమని ప్రదీప్ రావు అన్నారు.
బీసీల పై వివక్ష ప్రజలు నమ్మడం లేదు!
తాను బీసీల పక్షపాతి అని కొండా మురళి చెప్పడంపై ప్రదీప్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కార్పొరేటర్ ను అక్రమంగా జైల్లో పెట్టించారు. ఇటీవల మరో బీసీ కార్పొరేటర్‌పై మహిళతో తప్పుడు కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురి చేశారు” అని ప్రదీప్ రావు గుర్తుచేశారు. బీసీలను హింసిస్తూ, వారి కోసమే తాను పనిచేస్తున్నానని మురళి చెప్పడాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని ఆయన విమర్శించారు.
వరంగల్ తూర్పు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న కొండా దంపతులు ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ప్రదీప్ రావు ఆరోపించారు. కేవలం విమర్శలతోనే కాలాన్ని గడుపుతున్నారని విమర్శించారు. వరంగల్ తూర్పు అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కొండా మురళికి ప్రదీప్ రావు సవాల్ విసిరారు.
వరంగల్ ఓసిటిలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయానికి కొండా మురళి తరచుగా వస్తూ అధికారిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ప్రదీప్ రావు ప్రశ్నించారు. ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తికి అధికార యంత్రాంగం సహకరించడాన్ని తప్పు పట్టిన ఆయన, అధికార దుర్వినియోగం జరుగుతున్నా జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కొండా మురళిని రాజకీయంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించడం గమనార్హం. ఈ పరిణామాలు ఇటు ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లోనే కాక తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని రాజేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







