ఆదిలాబాద్, మహా
రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ సూచించారు. తాజాగా ఆసుపత్రిలో నలుగురికి అన్నవాహిక క్యాన్సర్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా జరిపినట్లు పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు జక్కుల శ్రీకాంత్, బండారి నరేందర్, దేవిదాస్, హిమాని, సతీష్, కార్తీక్, విజయ్ మోహన్, సత్యనారాయణ, ఆర్ ఏం ఓ చంపత్ రావు తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఓ క్యాన్సర్ పేషంట్ ఒక ఊపిరితిత్తును స్తంభింప చేసి, కడుపులో నుండి ఏకంగా అన్నవహికను తొలగించి, పెద్ద సంచిని అన్నవాహికగా మార్చడం జరిగిందని, తిరిగి పేషంట్ ను యధావిధి పరిస్థితికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇటువంటి అరుదైన శస్త్ర చికిత్సలు ఆరునెలల కాలంలో దాదాపు మూడు వందలకు పైగా జరిగాయన్నారు. మున్ముందు అన్ని విభాగాల్లోనూ అరుదైన శస్త్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ అస్పత్రి లో మెరుగైన సేవలు లభిస్తున్నాయని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.








