మంచిర్యాల, మహా :విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీగోడ, వంటశాల ఇతర అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. ఆహారం తయారీ సమయంలో నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమయంలో పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని, బడి బయట పిల్లలు, మధ్య బడి మానివేసిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఎత్తు, బరువు, కొలతలు స్వయంగా పరిశీలించారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి సకాలంలో ఆహారం, అవసరమైన మందులు అందించి సాధారణ స్థితికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శివ్వారం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, లబ్దిదారులు చేపట్టిన నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డి.సి.ఎం.ఎస్. ఫార్మర్ సర్వీస్ సెంటర్ ను సందర్శించి ఎరువులు, విత్తనాల స్టాకు నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. కేంద్రంలో ఉన్న స్టాకు నిల్వలు, ధరల వివరాలను ప్రదర్శించాలని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, రైతులు కొనుగోలు చేసి వాటికి సంబంధించి రశీదు తప్పనిసరిగా అందించాలని తెలిపారు. అనంతరం గంగిపెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టులో నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని తహశిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను సందర్శించి రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. రేషన్ కార్డుల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు కార్డులు జారీ చేయాలని చేశారు. వివిధ రకాల భూ సమస్యలపై ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులతో సరి చూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల తహశిల్దార్ వనజారెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. సత్యనారాయణ, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.








