Mahaa Daily Exclusive

  ఆరోగ్య పరిరక్షణ పై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

Share

ఆదిలాబాద్, మహా

విద్యార్థి దశ నుండే ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించేలా వారికి అవగాహన కల్పించేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ కళాశాలలు, ఉన్నత పాఠశాలలకే పరిమితమైన ఈ కార్యక్రమం ఈనెల 3 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించమన్నారు. గురువారం రణదీవే నగర్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ గేయాన్ని ఆలపించి ఆరోగ్య పాఠశాల బుక్ లెట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సెల్ ఫోన్ వినియోగం కారణంగా ఎదురయ్యే నష్టాలను వివరిస్తూ విద్యార్థులు చేసిన నాటిక ఆలోచింపచేసింది. అనంతరం హెల్తీ స్టూడెంట్స్ గా ఎంపికైన వారికి కలెక్టర్ బహుమతులు అందించి అభినందించారు. ఎస్బిఐ ద్వారా సీఎస్ ఆర్ ఫండ్ కింద నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించి… విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ల ను అందచేశారు. బడితోటలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం అయన మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లో భాగంగా 2047కు గాను ఆదాయ వనరులను త్రీ ట్రిలియన్ కు కసరత్తు సాగుతోందని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్ధి దశ నుంచే ఆరోగ్య పరిరక్షణ పై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. గతేడాది ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల్లలోనూ అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యాంగా ఉంటేనే చదువులో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బుక్ లెట్ ప్రకారం ఉపాధ్యాయులు ఆరోగ్య సూత్రాలు భోదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ సోమయ్య, ఎస్బీఐ ఆర్ఎం రామచంద్రరావు, చీఫ్ మేనేజర్ కే. సురేష్, శ్రీధర్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, మేనేజర్ బాలకృష్ణ, హెచ్ఎం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest