ఖమ్మం, మహా.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “చేయూత” పెన్షన్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా, ఖమ్మం జిల్లాలో శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు, సెర్ప్ సీఈఓ ఆదేశాలపై భక్తరామదాసు కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ అవగాహన సదస్సులో జిల్లా మున్సిపల్ కమిషనర్లు, మండలాల ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, డి.ఆర్.డి.ఏ చేయూత విభాగ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా పథకం అమలులో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, కీలక మార్గదర్శకాలు, లబ్ధిదారుల వివరాల అప్‌డేట్లు, మరియు బ్యాంకు ఖాతాల అనుసంధానం వంటి అంశాలపై పూర్తి వివరాలు అందించబడ్డాయి.
సెర్ప్ డైరెక్టర్ శ్రీ గోపాలరావు ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యవక్తగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి డి.ఆర్.డి.ఓ , అదనపు డి.ఆర్.డి.ఓ , డిపి.ఓ , డిప్యూటీ సీఈఓ జెడ్పీపీ , సెర్ప్ ఎస్.పి.యం పాల్గొని, సిబ్బందికి ప్రోత్సాహం అందించారు. వారి పర్యవేక్షణలో అవగాహన కల్పించడమే కాకుండా, ఫీల్డ్‌లో అమలు సమయంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది.
అంతటితోనే కాకుండా, అన్ని మండలాల నుండి వచ్చిన సిబ్బంది తమ అనుభవాలను పంచుకోవడంతో, ఒక వేదికపై సమస్యలు, పరిష్కారాలు చర్చించబడే మంచి అవకాశం లభించింది. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు ఎలాంటి సంకోచం లేకుండా సాంకేతిక అంశాలపై అవగాహన పెంపొందించుకొని, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందడుగు వేశారు.








