దమ్మపేట ,జూలై 3 మహా :
బస్టాండ్ లో పెట్రోలు బంక్ నిర్మాణ పనులను నిలిపివేయాలని నిరసిస్తూ బస్టాండ్ సాధన కార్యాచరణ కమిటీ యువకులు గురువారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు.మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణీకులు అవస్ధలు పడుతున్న సమయంలో ఆనాటి సర్పంచ్ దివంగత కక్కిరాల ధర్మలింగేశ్వరరావు కృషి చేశారు. నాడు లక్షల రూపాయల విలువైన పట్టాభూమిని దాతలనుండి ప్రయాణీకుల అవసరార్ధం ఉచితంగా సేకరించారు. అట్టి బస్ స్టాండును నాటి సత్తపల్లి శాసన సబ్యులు జలగం ప్రసాదరావు ఏప్రిల్ 5 ,1994 లో ప్రారంభించారు. నాడు సత్తుపల్లి నుండి అశ్వారావుపేట వైపు వెళ్ళే పల్లెవెలుగుల నుండి ఎక్స్ప్రెస్ ల వరకు అన్ని బస్ లు వస్తూ ,వెళుతూ ఉండేవి.కాలక్రమంలో బస్టాండ్ పై ఎవరూ ఆసక్తిని పెంచుకోకపోవడంతో మరుగున పడి ,బిక్షగాళ్ళకు నిలయంగా మారింది. దానిని గత కొంతకాలం క్రితం మేముసైతం ఫౌండేషన్ యువకులు స్వచ్ఛందంగా శుభ్రపరిచి ప్రయాణీకులకు ఉపయోగపడే విదంగా రూపుదిద్దారు. ఆ తర్వాత ప్రధాన పత్రికలలో బస్ స్టాండ్ పై అనేక వార్తలను ప్రచురించడంతో మరలా కొంతకాలం బస్ లు వస్తూండేవి. అటు తర్వాత స్ధానిక శాసన సబ్యులు జారె ఆదినారాయణ స్వయంగా జెసిబీలతో శుభ్రపరిచారు. ప్రయాణీకులకు అవసరమైన బస్టాండ్ ను పెట్రోలు బంక్ గా మార్చడానికి గల కారణాలేమిటి…? ఇందుకు సహకరించేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారనే అంశాలు వెలుగులోకి రావారని స్ధానిక యువత ప్రశ్నిస్తుంది.
సంఘీభావం ప్రకటించిన ఆదివాసి నాయకులు సోయం వీరభద్రం :
ప్రజలు చేపట్టే ప్రజాహిత కార్యక్రమంలో తాను ఎల్లప్పుడూ ముందుగా ఉంటానని ,ప్రజలకు అవసరమైన బస్టాండ్ లో పెట్రోలు బంక్ నిర్మించడం సరైన కార్యక్రమం కాదని ఆదివాసి రాష్ట్ర నాయకులు సోయం వీరభద్రం అన్నారు. నిరసన చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. వీరితో పాటుగా ఆదివాసి నాయకులు ఆరెం ప్రశాంత్ , వాడే వీరస్వామి తదితరులు ఉన్నారు.
మౌన ర్యాలి ,పట్టణ బంద్ కు పిలుపు:
బస్టాండ్ లో పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి ,మౌనంగా ర్యాలీ చేయనున్నట్లు కార్యాచరణ కమిటీ తెలిపింది. స్ధానిక బస్టాండ్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసనగా వెళ్ళి వినతి పత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శనివారం దమ్మపేట పట్టణ బంద్ కు పిలుపు నివ్లనున్నట్లు తెలిపారు. ప్రజాహిత కార్యక్రమంలో స్వచ్చందంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.








