Mahaa Daily Exclusive

  వీర జవాన్ ల త్యాగాలు మరువలేనివి జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

Share

ఆదిలాబాద్, మహా

మాతృ భూమి రక్షణ కోసం శత్రు దేశాలతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలు మరువలేనివని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కార్గిల్ దివస్ ను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గల కార్గిల్ పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర వీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి.. ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగ నీరతిని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. ఎన్ సిసి కేడెట్ లు సైతం అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమర సైనికుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. జవాన్ల స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణ త్యాగాలు చేసిన జవాన్ల సేవలు మరవలేనివని అన్నారు. దేశ స్వాతంత్ర సమయంలోనూ అనేక మంది వీరులు అసువులు బాసారని, వారి త్యాగాలను స్పూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.