ఖమ్మం,మహా.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు అమెరికా భూమిపై ఆత్మీయ స్వాగతం లభించింది. వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మున్నూరుకాపు ప్రముఖులు, సంఘ ప్రతినిధులు భారీగా తరలి వచ్చి ఎంపీ రవిచంద్రకు ఘన సత్కారం అందించారు.
గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ సమీప లీస్‌బర్గ్‌లో జరుగుతున్న మహాసభకు ముఖ్య అతిథిగా ఎంపీ రవిచంద్ర హాజరయ్యేందుకు అమెరికా వెళ్లారు. ఆయన ఈ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శనివారం రాత్రి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన, దుబాయ్ మీదుగా ఆదివారం ఉదయం (వాషింగ్టన్ కాలమానం ప్రకారం) అమెరికాకు చేరుకున్నారు.
విమానాశ్రయంలో పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి, “జై మున్నూరుకాపు – జై జై మున్నూరుకాపు”, “జిందాబాద్ జిందాబాద్ రవిచంద్రన్న జిందాబాద్” అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడ్డ మున్నూరుకాపులు, అలాగే మహాసభ కోసం భారతదేశం సహా పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తరువాత ప్రధాన అతిథి వద్దిరాజు రవిచంద్రను ప్రత్యేక కాన్వాయ్‌లో ఘనంగా తీసుకెళ్లి హోటల్‌కు చేరవేశారు. వాషింగ్టన్ మహాసభలో రవిచంద్ర ముఖ్య ప్రసంగం చేయనుండగా, మున్నూరుకాపు ఐక్యత, అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో సంఘం బలపరచడం వంటి అంశాలపై చర్చించనున్నారు.






