Mahaa Daily Exclusive

  కార్మిక హక్కులపై సిఐటియు సమరశీల పోరాటాలు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని పాలడుగు భాస్కర్ అన్నారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జె. రుద్రకుమార్ అధ్యక్షతన స్థానిక కాటేదాన్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా గైడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ హాజరై మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాన్ని రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమే అని అన్నారు. నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటలకు పెరిగిందని, రంగారెడ్డి జిల్లాలో అనేక పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులతో కంపెనీ యాజమాన్యాలు వెట్టి చాకిరి చేయిస్తున్నారని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని కంపెనీలలో అనేక ప్రమాదాల వల్ల కార్మికుల పిట్టల రాలిపోతున్నారని, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అయినా కార్మిక శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. మొన్న సౌత్ క్లాస్ ఇండస్ట్రీలో ప్రమాదం, నిన్న పాశమైలారం సిగాచి పరిశ్రమలో ప్రమాదం రేపు ఏ పరిశ్రమలో ఏ ప్రమాదం జరిగి ఏ కార్మికుడు చనిపోతాడు తెలియని అయోమయంలో వలస కార్మికులు ఉన్నారు. 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని రంగారెడ్డి జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కార్మిక శాఖ అధికారులను డిమాండ్ చేశారు. అలాగే స్కీం వర్కర్లు అయిన అంగనవాడి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని మండిపడ్డారు. వెంటనే స్కీం వర్కర్లను పర్మనెంట్ చేయాలని, పరిశ్రమంలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాల జీవోలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ చేయాలని, 26 వేల కనీస వేతనం ఉండేటట్లు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం చంద్రమోహన్, కోశాధికారి కవిత, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి కిషన్, డి జగదీష్, నర్సిరెడ్డి, అల్లి దేవేందర్, జిల్లా సహాయ కార్యదర్శిలు రామ్మోహన్, స్వప్న, వీరయ్య, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Latest