మంచిర్యాల, మహా : సింగరేణి కాలరీస్ కంపెనీ బొగ్గు పరిశ్రమలో కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహించడంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటియుసి), ప్రాతినిధ్య సంఘం (ఐ.ఎన్.టి.యు.సి) సంఘాలు విఫలం అయ్యాయని కార్మికులు విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి కొడుకుల ఉద్యోగాల కల్పన ప్రారంభ సమయంలో నెలకు ఒక ధపా, మెడికల్ బోర్డును నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అవేవి ఇక్కడ కానరావడం లేదు. ఒకవైపు తండ్రి కొడుకుల ఉద్యోగాలు తాము పునరుద్ధరించామని ఒక యూనియన్ అంటుంటే, తాము అందులో పాత్రధారులమని గొప్పలు చెప్పుకొని, జబ్బలు సర్సుకున్న యూనియన్ నాయకులకు ప్రస్తుతం తెల్లముఖమేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన సింగరేణి కార్పొరేటు మెడికల్ బోర్డు తర్వాత మరోసారి మెడికల్ బోర్డు జరగకపోవడంపై కార్మిక వర్గం గుర్రుగా ఉంది. అయితే ఇంతకు క్రితం కొంతమందిని మెడికల్ బోర్డులో అన్ఫిట్ చేయకుండా హయ్యర్ రిఫరెన్స్ పేరుతో 9, 10 నెలలుగా పెండింగులో పెట్టి అటు జీతం లేకుండా తీవ్ర నష్టానికి గురిచేసిన యాజమాన్యం ఎట్టకేలకు 55 మందికి సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు కు 31 జూలై 2025 నాడు హాజరు కావలసిందిగా ప్రకటించింది.
ఇలా నిర్వహించిన మెడికల్ బోర్డు 55 మందికి గాను ఒకరు బోర్డుకు గైర్హాజరు కాగా, మిగిలిన 54 మంది నుండి కేవలం 5 గురిని మాత్రమే అన్ఫిట్ చేసి, మిగతా వాళ్లలో కొందరికి ఎవరి డ్యూటీలకు వాళ్లు వెళ్లాలని, ఇంకొందరిని సర్ఫేస్ ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మెడికల్ బోర్డు ప్రారంభం నుండి ఎప్పుడూ ఎదురు కానీ ఈ విపత్కర పరిస్థితిని చూసి కార్మిక వర్గం కలవర పడుతోంది. పదిమంది కార్మికులు మెడికల్ బోర్డు కు హాజరైతే అందులో ఒకరిని అన్ఫిట్ గా ఎంపిక చేయడం ఏంటని కార్మికుల్లో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
55 మంది మెడికల్ బోర్డుకు హాజరైతే కేవలం 5 అన్ఫిట్
2025 జులై 31 నాడు నిర్వహించిన మెడికల్ బోర్డుకు హాజరైతే కేవలం 5 అన్ఫిట్ చేయడం అన్యాయమని కార్మికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 55 మంది బోర్డుకి వెళ్ళగా అందులో ఒకరు గైరాజరు కాగా 32 మందిని సేమ్ టు జాబ్ కు పంపగా మిగిలిన 17 మందిని సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు సర్ఫేస్ విధులకు సిఫార్సు చేసింది.
మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి గైరాజరే
కార్మికులు వివిధ కారణాల చేత పీడింపబడుతున్నామని పేర్కొంటూ సింగరేణి మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి కార్పొరేట్ మెడికల్ బోర్డుకు పిలిచే వరకు కార్మికులు విధులకు గైరాజరవుతున్నట్లు హాజరు పట్టిక గణాంకాలు చెబుతున్నాయి. ఒక్కొక్క కార్మికుడు పది నెలల నుండి సంవత్సరం వరకు విధులకు గైరాజరుగుతున్నట్లు తెలుస్తోంది. సాలిన ఒక నెల జీతం కార్మికునికి లక్ష రూపాయలు వస్తుందంటే 10 నెలలకు 10 లక్షల రూపాయలు కార్మికునికి నష్టం జరిగిందని అర్థమవుతుంది. వీరి లోటును ఎవరు తీరుస్తారో ఎదురుచూడాల్సిందే.
గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు విఫలం
గత 5 నెలలుగా సింగరేణి కంపెనీలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై
సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) ప్రాతినిధ్య (ఐ.ఎన్.టి. యు.సి) సంఘాలు
విఫలం అయ్యాయని కార్మికులు ధ్వజమెత్తుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ దాని అనుబంధ సంస్థ (ఏఐటీయూసీ) తో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సింగరేణి యాజమాన్యం సీ అండ్ ఎండి చైర్మన్ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయకుంటే ఈ రెండు యూనియన్లు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని
కలిసే అవకాశం ఉంది. కానీ వీరు ఎందుకు కలవడం లేదో అర్థం కావడం లేదని కార్మికులు కలవర పడుతున్నారు.






