మంచిర్యాల, మహా : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు బాల్క సుమన్ విమర్శించారు. గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు అప్పుడే బాగుండేది కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అందజేసేందుకు ఆయన నాయకులు కార్యకర్తలతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, వరంగల్లో రైతు డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్, సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ ఇచ్చి, నిరుద్యోగ యువతకు నెలకు 4000 రూపాయల భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత ఎమ్మెల్యే కొనసాగించడం లేదని ఆ విధంగా వ్యక్తం చేశారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలో 1 సెప్టెంబర్ నుంచి 15 రోజులపాటు “అప్పుడే బాగుండేది” అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగంగా వివిధ గ్రామాలకు పట్టణాలలో నెలకొన్న 40 వేల సమస్యలను తమ పార్టీ సేకరించినట్లు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కు ఇచ్చేందుకు తమ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ సిసి కి ఫిర్యాదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేష్, బండారి సూరిబాబు, కొంగల తిరుపతిరెడ్డి, బత్తుల శ్రీనివాస్, ఎండి అబ్బాస్, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్ తదితరులు పాల్గొన్నారు.






