Mahaa Daily Exclusive

  మేం పారిపోవట్లేదు.. యూరియా అంశంపై చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు

Share

అమరావతి, మహా: యూరియా అంశంపై శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి. యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యూరియా సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడుతూ.. తీర్మానం ఇచ్చారు. దీనిపై మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు స్పందిస్తూ.. వైసీపీ తీర్మానాన్ని తిరస్కరించారు. మరో రోజు ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపడతామని సముదాయించారు. అయినా వైసీపీ సభ్యులు శాంతించకపోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.

గతంలో రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయా?
యూరియా అంశంపై చర్చకు వాయిదాలు ఎందుకని బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో రైతులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. సభలో ఏరోజు అజెండా ఆరోజు ఉందన్నారు. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోవడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏం చేసింది.. ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలు ప్రజలు తెలియాలన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుందనే విషయాలు వారికి చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని.. చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Latest