Mahaa Daily Exclusive

  జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కుమారి దీపక్ తెలిపారు.
ఆదివారం చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలో గల ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి యామిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి ఆకస్మికంగా సందర్శించి యూరియా నిల్వలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల సమన్వయంతో జిల్లాలోని రైతులందరికీ పంట సాగుకు అవసరమైన యూరియా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ సాగుకు యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, సాగుకు అవసరమైన యూరియా తీసుకొని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ముందస్తు సాగుకు, అవసరానికి మించి యూరియా తీసుకోకూడదని, యూరియా పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సాగు చేస్తున్న రైతులకు సమయానుకూలంగా యూరియా అందించడం జరుగుతుందని, ఈ మేరకు రైతులు సహకరించాలని తెలిపారు. అంతకుముందు చెన్నూరు మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, సర్వే ల్యాండ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి హాజరయ్యారు. ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు ఇతర సంబంధిత ఎన్నికల అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు శిక్షణలో అందించిన అంశాలను నేర్చుకుని ఎన్నికల నిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించాలని, ప్రక్రియ నిర్వహణలో అనుమానాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest