ఆదిలాబాద్ మహా: స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడడంతో జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణపై కసరత్తు ప్రారంభించారు. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా ఇతర ముఖ్య జిల్లా అధికారులతో కలిసి జడ్పీ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రకటన దగ్గరనుండి నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, నిర్వహణపై దిశానిర్దేశం చేసారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు.ఎన్నికల నియమావళిని అధికారులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు.ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ పర్యవేక్షణలో కొనసాగించాలన్నారు. అధికారులు ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.ఎన్నికల విధుల్లో రిటర్నింగ్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకమని,బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్,అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ సలోని చబ్ర,జడ్పీ ఇన్చార్జి సీఈఓ రవీందర్ రాథోడ్,డీపీఓ,ఆర్ఓలు పాల్గొన్నారు.






