- ఆన్లైన్ గోదావరి ఇసుకకు 3300… మందమర్రి వాగు ఇసుకకు 3500
- తాసిల్దార్ సతీష్ కుమార్ కొంచెం దేకో సార్
మందమర్రి, మహా : మందమర్రి లో అందరూ హరిచంద్రులే… కానీ రొయ్యల ముల్లెలు మాత్రం మాయం అవుతున్నాయి అనే చందంగా ప్రభుత్వ అధికారుల వ్యవహారం ఉంది. ప్రభుత్వ నిర్మాణాలకు మాత్రమే స్థానిక ఇసుకను వాడాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని స్థానిక ట్రాక్టర్ యజమానులు, కాంట్రాక్టర్లు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. మంచిర్యాల గోదావరి ఇసుక మందమర్రి కి రావాలంటే ఒక ట్రాక్టర్ కు 3300 రూపాయలు ఆన్లైన్ చాలన్ కడితే 24 గంటల్లో వస్తుంది. కానీ మందమర్రి మండలంలో వివిధ సొంత నిర్మాణాలకు ప్రజలు వాడాలంటే ట్రాక్టర్ యజమానులు 3500 రూపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తుండగా ఆ ఇసుక ట్రిప్పు ఎప్పుడు వస్తుందో తెలియ రావడం లేదు.
- విచ్చలవిడిగా అక్రమ ఇసుక
మందమర్రి మండలంలో అక్రమ ఇసుక దందా విచ్చలవిడిగా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బొక్కలగుట్ట, పులిమడుగు, కోటేశ్వరరావు పల్లె, అందుగుల పేట, ఊరు మందమర్రి, సారంగపల్లి, శంకర్ పల్లి తదితర గ్రామాల నుంచి ట్రాక్టర్లు నిత్యం ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొంతమంది గ్రామవాసులు ఇసుక ట్రాక్టర్ నింపితే ఒక ట్రిప్పుకు 1000 నుండి 1500 రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిద్ర మత్తులో సంబంధిత అధికారులు
ఒకపక్క మందమర్రి మండలంలో విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతున్న సంబంధిత
రెవెన్యూ, అటవీ అధికారులకు తెలిసిన పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఒక సంవత్సరం క్రితం మండలంలో అటవీ అధికారులు అక్రమ ఇసుకపై ఉక్కు పాదం మోపి పలు ట్రాక్టర్ల పై భారీ మొత్తంలో అపరాధ రుసుము వేసి ట్రాక్టర్ ఓనర్లకు గుబులు పుట్టించిన విషయం విధితమే. అయితే ప్రస్తుతం ఇక్కడ ఆ అధికారుల జాడ కాన రాకపోవడం గమనార్హం. రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖ అధికారులు నామమాత్రపు పర్యవేక్షణ చేయకపోవడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఒక ట్రాక్టర్ కు 500 రూపాయలు..!?
మందమర్రి లోకల్ వాగులలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానుల వద్ద యాపల్ ప్రాంతానికి చెందిన పాత్రికేయుడు ఒక ట్రాక్టర్ కు నెలకు 500 రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సదరు పాత్రికేయుడు ఎవరైనా మీ ట్రాక్టర్ ను ఆపితే నాకు ఫోన్ చేయండి నేను వారితో కానీ ఇతర సంబంధిత అధికారులతో కానీ మాట్లాడుతానని ట్రాక్టర్ యజమానులకు అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో గత నాలుగు సంవత్సరాలుగా మండలంలో ఆ పాత్రికేయుడు దాదాపు నెలకు 15వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారమే కాకుండా మిగతా అక్రమ వ్యవహారాలలో కూడా ఇతగాడి పాత్ర ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.మందమర్రి తాసిల్దార్ సతీష్ కుమార్ వివరణ
మందమర్రి మండలంలో ఇసుక అక్రమ రవాణా గురించి స్థానిక తాసిల్దార్ సతీష్ కుమార్ ను
వివరణ కోరగా ఒక పొన్నారం గ్రామంలో మాత్రమే ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నాయని వెల్లడించారు. తాను మండలంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల రూపాయల మేరకు అక్రమ ఇసుక ట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అపరాధ రుసుములు కట్టించినట్లు తెలిపారు. అందుగుల పేట, బొక్కలగుట్ట, ఊరు మందమర్రి, శంకర్ పల్లి తదితర పరిసర వాగుల నుండి అక్రమంగా ఇసుక తరలింపులు జరిగితే తమకు సమాచారం ఇస్తే పట్టుకుంటామని ఆయన చెప్పారు. అలా కాని పక్షంలో గ్రామస్తులు కానీ బాధ్యత గల పౌరులు కానీ అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అక్రమ ఇసుక రవాణా నివారణకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఆయన స్పష్టం చేశారు.






