హైదరాబాద్, మహా: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చర్చించారు. గత కొన్ని రోజులుగా తనకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సమయంలో చోటు చేసుకున్న డ్రామాను వారికి వివరించారు. భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘‘ నా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. సెటిల్ చేస్తామని పార్టీ పెద్దలు చెప్పారు. మిగిలిన విషయాలు వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా’’ అని మంత్రి సురేఖ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని నేతల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. డెక్కన్ సిమెంట్ యాజమాన్యం వ్యవహారంలో జరిగిన పరిణామాలు, వారితో జరిగిన చర్చలు, ఆ సంస్థ అక్రమాలు తదితర విషయాలన్నీ వివరించినట్లు తెలుస్తోంది.







