- పత్తి రైతులు పారాహుషార్
- దళారుల చేతిలో మోసపోకండి
- పండించిన పంట మొత్తాన్ని సీసీఐ కొనుగోలు చేస్తుంది -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : దళారులను నమ్మి పత్తి రైతులు మోసపోవదదని, పండించిన పత్తి పంటను పూర్తిగా సీసీఐ కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి అని అన్నారు. రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతోందని, 22 లక్షలకు పైగా రైతులు పత్తిని పండిస్తున్నారన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరి క్వింటాల్ వరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. క్వింటాల్ పత్తి రూ. 8,110 ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. ప్రతి ఏటా రాషఅట్రంలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతోందని, పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడు కొనుగోలు కేంద్రాలను మరో 12పెంచామన్నారు. పత్తి సాగు ఉత్పత్తిలో సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. తొమ్మిది ప్రాంతీయ భాషల్లో పత్తి సాగుకు సంబంధించి కిసాన్ యాప్‌ను తీసుకొచ్చామని, యాప్‌లో రైతులు నమోదు చేసుకుంటే.. స్లాట్ ద్వారా పత్తిని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చన్నారు. పత్తి శుద్ధి, రవాణా కోసం జిన్నింగ్ మిల్లులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. హై డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల పంట దిగుబడి డబుల్ అవుతుందని తెలిపారు. మహారాష్ట్ర అకోలా ప్రాంత ప్రజలు హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నారని.. హై డెన్సిటీ ప్లాంటేషన్‌పై అవగాహన కోసం అవసరమైతే రైతులను మహారాష్ట్రకు తీసుకెళ్తామని చెప్పారు. కిసాన్ యాప్ దీపావళి నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పదేళ్లలో కనీస మద్దతు ధర వంద శాతం పెరిగిందన్నారు. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ పెట్టీ జైలుకు పంపుతున్నామన్నారు







