- సింగరేణి కార్మికులకు తీపి కబురు
- రూ.400 కోట్ల దీపావళి బోనస్ విడుదల
- సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన భట్టి
ఖమ్మం, మహా: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం ప్రతిసారి ప్రకటించినట్లే ఈ ఏడాది కూడా.. సింగరేణి కార్మికులకు 400 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించిందన్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లా నుంచే సింగరేణి ప్రస్థానం మొదలైందన్నారు. సింగరేణి ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదిగిందన్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టుకు, ఇతర ఇండస్ట్రీలకు పనికివచ్చే బొగ్గును.. సింగరేణి సరఫరా చేస్తోందని భట్టి విక్రమార్క కొనియాడారు. అనంతరం బిజేపీపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ తీరు బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కాకుండా అడ్డుపడుతుంది బీజేపీనే అని భట్టి ఆరోపించారు.
బీజేపీ డ్రామాలను గమనిస్తూన్నే ఉన్నాం..
బీసీ బిల్లు విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న విధానం దేశం మొత్తం చూస్తోందన్నారు. బీసీ బిల్లు విషయంలో హైకోర్ట్, సుప్రీంకోర్టుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కోట్లాడుతోందని భట్టి తెలిపారు. బీసీ బిల్లు ఆమోదం కోసం తమ వైపు నుంచి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని భట్టి చెప్పారు. నేడు జరిగే బంద్ బీసీ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నందుకేనన్నారు. బీసీ బిల్లు విషయంలో బీజేపీ అడ్డుపడడమే కాకుండా అడ్డగోలుగా మాట్లాడుతోందని భట్టి అన్నారు. బీసీలు అంత అమాయకులు కాదని.. బీజేపీ డ్రామాలను గమనిస్తూన్నే ఉన్నారన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని ,ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసిన కేంద్రం నుంచి అనుమతి ఇవ్వలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని.. విజయవంతం చేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు







