Mahaa Daily Exclusive

  బీసీ పోరాటంలో కవిత కుమారుడు ….తల్లితో కలిసి బంద్‌లో పాల్గొన్న ఆదిత్య

Share

  • బీసీ పోరాటంలో కవిత కుమారుడు
  • తల్లితో కలిసి బంద్‌లో పాల్గొన్న ఆదిత్య
  • రిజర్వేషన్ల సాధన కోసం రోడ్డుపై నిరసన

హైదరాబాద్, మహా : 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల క‌విత ఖైరతాబాద్ చౌరస్తాలో నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోరాటంలో తల్లి కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా రోడ్డెక్కారు. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన ఆదిత్య బీసీల రిజర్వేషన్ల పోరాటానికి తన మద్దతును గట్టిగా వినిపించారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే’ అంటూ ఫ్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేవలం తమ తల్లి లేదా కొందరు నాయకులు మాత్రమే పోరాటం చేస్తే సరిపోదని, ప్రతి ఇంటి నుంచి అందరూ బయటకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అవసరమని బీసీల రాజకీయ సాధికారతకు ఇది తప్పనిసరి అని ఆదిత్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వటం విచారకరమన్నారు. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆమె కోరారు. బంద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో పొల్గొనడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. హత్య చేసిన వాడే సంతాప సభ పెట్టినట్లుందని కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయని, ఈ రెండు పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.

అందినంత దండుకున్న క్యాబ్ లు

బంద్ నేపత్యంలో ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాకపోవడాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ క్యాబ్‌ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ప్రయాణికులను నిలువునా దోపిడీ చేశాయి. సాధారణం కంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకున్నాయి. అత్యవసర సేవల్లో పనిచేసే సిబ్బంది సైతం ఉద్యోగాలకు వెళ్లేందుకు ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయించి అధిక ధరలు చూసి బెంబేలెత్తారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ల దందా ప్రయాణికులకు షాక్‌నిచ్చింది. ఉప్పల్ నుంచి హన్మకొండకు సాధారణ రోజుల్లో రూ. 300 వసూలు చేసే క్యాబ్‌ డ్రైవర్లు.. బంద్ కారణంగా ఏకంగా రూ.700 వరకు డిమాండ్ చేశారు. ఎల్ బీ నగర్ నుంచి సూర్యపేటకు వెళ్ళేందుకు సాధారణ రోజులలో రూ. 200 లు వసూలు చేసే క్యాబ్ డ్రైవర్లు ఏకంగా రూ. 800 ల వరకు వసూలు చేశారు. ఇది దాదాపు డబుల్ కంటే ఎక్కువ ఛార్జీ. మరోవైపు నగరంలో ఇన్నాళ్లు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పథకం కారణంగా ప్రయాణికులు లేక వెలవెలబోయిన ఆటోలకు, బంద్ కారణంగా ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రయాణికుల రద్దీతో ఆటోలు ఫుల్ డిమాండ్‌తో నడుస్తున్నాయి, ఆటో డ్రైవర్లు సైతం ఇష్టానుసారంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి