Mahaa Daily Exclusive

  కర్నూలు జిల్లాలో దారుణం..బస్సులో.. బుగ్గి.. 19 మంది సజీవ దహనం

Share

  • బస్సులో.. బుగ్గి.. 19 మంది సజీవ దహనం
  • ఉలిక్కిపడ్డ తెలుగురాష్ట్రాలు
  • కర్నూలు జిల్లాలో దారుణం
  • – మృతులలో ఆరుగురు తెలంగాణ వాసులు.. 11మంది ఏపీ
  • బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ , సీఎంలు రేవంత్, చంద్రబాబు దిగ్బ్రాంతి
  • ప్రమాదస్థలికి తెలంగాణ మంత్రి జూపల్లి.. ఏపీ హోం మంత్రి అనిత
  • బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నాం: మంత్రి పొన్నం
  • కర్నూలు దుర్ఘటనపై 16 బృందాలతో దర్యాప్తు : హోం మంత్రి అనిత
  • ప్రమాదం వెనుక కుట్ర ఉందని అనుమానం- కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

….తెల్లవారుజామున 3 గంటల సమయం. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై బస్సు రయ్ రయ్ న దూసుకు వెళ్తోంది. తమ గమ్య స్థానానికి సురక్షితంగా చేరుకుంటామనే నమ్మకంతో ప్రయాణికులు అంతా గాఢ నిద్రలో మునిగిపోయారు. ఒక్కసారిగా అనుకోని ప్రమాదం.. ఊహించని ఉపద్రవం. బైక్‌ను ఢీకొనడంతో బస్సులో ఆకస్మిక మంటలు చెలరేగాయి. ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు వ్యాపించి పొగ కమ్మేసింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో బస్సులోని అద్దాలు పగలగొట్టి కొందరు కిందకు దూకేశారు. మరికొందరు బస్సులోనే అగ్నికి ఆహుతైపోయారు. కర్నూలు శివారు చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణమైన ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. భయానకమైన ఘటనా స్థలి దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఈ పెనువిషాదం రెండు తెలుగురాష్ట్రాలను ఉలికిపాటుకు గురిచేసింది.

కర్నూలు, మహా : కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 41 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. వీరిలో 19 మంది సజీవ దహనం కాగా.. 22 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్లలో ఒకరు పరారవగా.. మరొకరు పోలీసుల అదుపులో ఉన్నారు.
బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయాడు. బైక్‌ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్‌లోని పెట్రోల్‌ లీక్‌ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా, పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు.. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నారు. ప్రమాద మృతులలో ఆరుగురు తెలంగాణ వాసులు ఉన్నారు. మొత్తం 15మంది టికెట్లు బుక్ చేసుకోగా, ఒకరు బస్ ఎక్కలేదు. 14మందిలో 8మంది సేఫ్ గా ఉండగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, వైసీపీ అధినేత జగన్ తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి జూపల్లి క్రిష్ణారావు సంఘటనా స్థలానికి వెళ్ళగా, మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటన గురించి ఆరా తీయడంతో పాటు తక్షణ సాయం ప్రకటించారు. చంద్రబాబు ఆదేశాలతో ఏపీ మంత్రులు అనిత, రాంప్రసాద్ లు రంగంలోకి దిగారు.

బస్సు ప్రమాదం.. ప్రయాణికుల పూర్తి జాబితా ఇదే…

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన బస్సులో బస్సులో అశ్విన్‌రెడ్డి (36), జి.ధాత్రి(27), కీర్తి(30), పంకజ్‌(28), యువన్‌ శంకర్‌రాజు (22), తరుణ్‌(27), ఆకాశ్‌(31), గిరిరావు (48), బున సాయి(33), గణేశ్‌(30), జయంత్‌ పుష్వాహా (27), పిల్వామిన్‌ బేబి (64), కిశోర్‌ కుమార్ (41) రమేష్‌(30) అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు, అనూష(22), మహ్మద్‌ ఖైజర్‌ (51), దీపక్‌ కుమార్‌ (24), అన్డోజ్‌ నవీన్‌కుమార్ (26), ప్రశాంత్‌ (32), ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్‌ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), జయసూర్య(24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కె.అశోక్‌ (27), ఎం.జి.రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్‌ కుమార్ (18), వేణుగోపాల్‌రెడ్డి (24) ఉన్నారు.

ప్రాణాలతో బయటపడిన వారు వీరే..

ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్‌, అఖిల్‌, జష్మిత, అకీర, రమేష్‌, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్‌కు చెందిన నవీన్‌ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హైమా రెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌: ఏపీలోని కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల ఆర్థికసాయం అందిస్తామని వెల్లడించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ దురదృష్టకర ప్రమాదం తనను ఎంతగానో బాధిస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు తక్షణ సాయం కింద రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు.

కర్నూలు దుర్ఘటన.. 16 బృందాలతో దర్యాప్తు : హోం మంత్రి అనిత

కర్నూలు: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏపీ హోం మంత్రి అనిత వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతుల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, ఒడిశా, బిహార్‌ నుంచి ఒక్కొక్కరు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. మరొకరి మృతదేహం గుర్తించాల్సి ఉంది. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత‌, రాం ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బస్సులో 39 మంది పెద్దవాళ్లు, నలుగురు చిన్నారులతోపాటు గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. ప్రమాదం నుంచి ఇద్దరు డ్రైవర్లు సహా 27 మంది బయటపడ్డారు. స్వల్ప గాయాలతో ఆస్పత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హోం మంత్రి వెల్లడించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్‌ ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కాలిపోయాయన్నారు. చనిపోయిన వ్యక్తుల డీఎన్‌ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అందజేస్తామన్నారు. ఈ ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షల కోసం 10 ప్రత్యేక బృందాలు పని చేస్తాయన్నారు. ప్రమాదానికి కారణాలు అన్వేషించేందుకు మరో 4 బృందాలు, రసాయన విశ్లేషణ కోసం 2 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
బస్సు డ్రైవర్లిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీ కొట్టినట్లు బస్సు డ్రైవర్‌ చెప్పాడని, అంతకుముందే రోడ్డు ప్రమాదంలో బైక్‌ పడిపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘‘ బైకు పైనుంచి బస్సు వెళ్లడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్‌ చెప్పాడు. ప్రమాదానికి గల కారాణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది’’ అని ఎస్పీ వివరించారు.

బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నాం: మంత్రి పొన్నం

కర్నూల్ జిల్లా‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటన తనను తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాదంపై ఆరా తీశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉంటే రవాణా‌శాఖకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో ఫోన్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుందని.. ఇలాంటి నిబంధనలను కఠినతరం చేస్తాం. బస్సులపై రోజువారీ రవాణా శాఖ తనిఖీలు చేపడుతుంటే వేధింపులు అంటున్నారని.. వదిలేస్తే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టామన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

Latest