ఒకప్పుడు అమరావతి రైతుల తరపున గట్టి పోరాటం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇప్పుడు సొంత పార్టీలోనే ఇమడలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛ ప్రాంతీయ పార్టీల్లో, ముఖ్యంగా టీడీపీలో ఉండదని, ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్తగా ఉండాలని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. గతంలో నిరంతరం పోరాటాలతో లైమ్‌లైట్‌లో ఉన్న కొలికపూడికి, ఆయన పోరాటం ఫలితంగానే 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ లభించి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ప్రస్తుతం ఆయన తీరు కారణంగా రోజురోజుకూ ఆయన ‘రేటింగ్’ పడిపోతుందనే వాదన వినిపిస్తోంది.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కొలికపూడి, ఇప్పుడు అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మారిపోయి సొంత పార్టీ నేతలపైనే వాగ్బాణాలు సంధిస్తున్నారనే టాక్ ఉంది. దీంతో ఆయన సొంత పార్టీకే తలనొప్పిగా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన స్థాయికి మించి చిన్న చిన్న వివాదాల్లో తలదూర్చడం, ముఖ్యంగా గోపాలపురం గ్రామంలోని రోడ్డు పంచాయితీలో జోక్యం చేసుకోవడం వంటి ఘటనలు ఆయనకు సమస్యలను తెచ్చిపెట్టాయి. ఆ వివాదంలో వైసీపీ వార్డు సభ్యురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని ఆయన్ను మందలించాల్సి వచ్చింది.
వివాదాలకు కేరాఫ్‌గా మారిన కొలికపూడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే కంభంపాడులో ఓ వైసీపీ నేత ఆక్రమించుకున్న స్థలం కోసం ధర్నాకు దిగడం, అధికారులతో వాదించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను సీరియస్‌గా హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాకుండా, సొంత పార్టీ నేత పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారంటూ అందరి ముందు తిట్టడం, ఆ తర్వాత మద్యం షాపులకు తాళాలు వేయడం వంటి చర్యలతో ఆయన తన దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శలు వచ్చాయి.
ఇక, తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో టికెట్ వివాదం చెలరేగడం, టికెట్ కోసం ఆయనకు రూ. 5 కోట్లు ఇచ్చానని బహిరంగంగా ఆరోపణలు చేయడం పార్టీలో పెద్ద రచ్చకు దారితీసింది. కొలికపూడి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులతో సఖ్యతగా ఉండలేకపోతున్నారని, తన గెలుపు కోసం పనిచేసిన పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులతో కలుస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తిరువూరు మైనింగ్‌లో వైసీపీ నాయకులే కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, వారితో కలిసి కొలికపూడి ఇసుక దందా చేస్తున్నారన్న టాక్ ఎంపీ చిన్నితో గ్యాప్‌కు ఒక కారణంగా చెబుతున్నారు.
ఎమ్మెల్యే తీరుపై విసిగిపోయిన నియోజకవర్గ టీడీపీ నేతలు, క్యాడర్ ఎంపీ కేశినేని చిన్ని వెంట నడుస్తున్నారు. తాజా ఆరోపణల నేపథ్యంలో కొలికపూడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు హైకమాండ్‌కు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కొలికపూడి వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉందని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఆయనకు ఫోన్ చేసి పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నారని హెచ్చరించినట్లు సమాచారం. ఈ మొత్తం వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ రంగంలోకి దిగుతున్నారని, త్వరలోనే కొలికపూడికి క్లాస్ తీసుకోబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.







