Mahaa Daily Exclusive

  టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు తీవ్ర గాయం: ఐసీయూలో చికిత్స

Share

భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా పక్కటెముకకు తీవ్రమైన గాయం కావడంతో జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బ్యాక్‌వర్డ్ పాయింట్‌ ప్రాంతం వైపు వెనక్కి స్ప్రింట్ చేస్తూ, అలెక్స్ కారీ క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ తీవ్రమైన దెబ్బ కారణంగా శ్రేయాస్ ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గాయం తీవ్రత దృష్ట్యా, అతడిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, వైద్యులు చేసిన రిపోర్ట్స్‌లో శ్రేయాస్‌కు అంతర్గత రక్తస్రావం (Internal bleeding) అయినట్లు గుర్తించారు. రక్తస్రావం కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, అతడు దాదాపు 2 నుంచి 7 రోజుల వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంటాడని జాతీయ మీడియాకు ఒక వ్యక్తి తెలిపారు. మొదట్లో అయ్యర్ సుమారు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉంటారని భావించినప్పటికీ, అంతర్గత రక్తస్రావం కారణంగా అతడు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

గాయం తీవ్రత కారణంగా, శ్రేయాస్ పోటీ క్రికెట్‌కు తిరిగి రావడానికి పట్టే ఖచ్చితమైన సమయాన్ని ఇప్పుడే చెప్పడం కష్టమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. టీమిండియా ఫారమ్‌లో ఉన్న ఈ కీలక బ్యాటర్ కోలుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశం. భారత క్రికెట్ అభిమానులు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.