Mahaa Daily Exclusive

  మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ..లొంగిపోయిన మావోయిస్టు మరో అగ్రనేత

Share

  • మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ
  • డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు మరో అగ్రనేత
  • సరెండర్ అయిన కీలక నేత బండి ప్రకాష్, మరో నేత చంద్రన్న

హైదరాబాద్, మహా : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా కొనసాగుతున్న మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటులో భాగంగా మంగళవారం మరో కీలక నేత తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నలు ఆయుధాలతో సహా లొంగిపోగా తాజాగా మరో కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ డీజీపీ శివధర్‌ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. లొంగిపయిన మండిస ప్రకాష్ మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్‌గా, అలాగే నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 45 ఏళ్లుగా బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. బండి ప్రకాష్ తో డీజీపీ ఎదుట మరో కేంద్ర కమిటీ సభ్యుడు పూల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న అలియాస్ చంద్రన్న కూడా లొంగిపోయారు.

బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తూ అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై 1980లో సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు. 1988లో బెల్లంపల్లిలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో జైలు శిక్ష అనుభవించారు. ఈ సమయంలోనే ఆయన పేరు ఒక సంచలనమైంది. ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నాటి పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సేన్, ముంజ రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ జైలు గోడలను బద్దలు కొట్టి, తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది.

అనంతరం 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాష్ 2004లో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఆయన మళ్లీ అడవి బాట పట్టారు. గత 20 ఏళ్లుగా బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం బండి ప్రకాష్ పై ప్రకటించిన రూ. 20 లక్షల రివార్డు సొమ్మును డీడీ రూపంలో బండి ప్రకాష్ కు ఈ సందర్భంగా డీజీపీ అందజేశారు.

ఇక ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు 60 మందికి పైగా సహచరులు కూడా లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా దాదాపుగా పార్టీలో రెండో స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల అడవి విడిచి జనజీవన స్రవంతిలో చేరారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన.. పార్టీ వైఖరిపై విమర్శలు చేస్తూ బహిరంగ లేఖలు రాయడం ద్వారా వార్తల్లో నిలిచారు. మరో అగ్రనేత, బీజాపూర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో లొంగిపోయారు. ఆశన్నతో పాటు 209 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం ఈయన స్వస్థలం. 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో కొనసాగి జన జీవన స్రవంతిలో కలిశారు

Latest