- శంకరమఠంలో శృంగేరీ జగద్గురువును
- మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
- వేములవాడ ఆలయాభివృద్ధిపనులపై వివరణ
హైదరాబాద్, మహా : తన పర్యటనలో భాగంగా నల్లకుంట శంకర మఠానికి శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిని మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామిని కలిసిన సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయన వివరించారు.
మా ప్రభుత్వం లక్ష్యం ఇదే : రేవంత్ రెడ్డి
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి మహర్ధశ వచ్చిందని, జగద్గురు ఆశీస్సులతో విస్తరణ పనులు సాగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల, దివ్యక్షేత్ర పునరుద్ధరణ ప్రణాళికలను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వేములవాడ ఆలయ అభివృద్ధి పట్ల ప్రభుత్వ కట్టుబాటు జరుగుతున్న పనుల పురోగతిని స్వామివారికి వివరించారు. జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మరింత వైభవంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా ఆలయాన్ని సుందరంగా మారుస్తామని స్పష్టం చేశారు







