Mahaa Daily Exclusive

  దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు వెన్నెముక ఎన్‌డిఆర్ఎఫ్:మంత్రి బండి సంజయ్

Share

  • దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు వెన్నెముక ఎన్‌డిఆర్ఎఫ్
  • కొత్త రకాల విపత్తులను ఎదుర్కొనడానికి సిద్ధమైన ఎన్డీఆర్ఎఫ్
  • ఈ ఒక్క ఏడాదిలోనే 1600 మంది ప్రాణాలను కాపాడారు
  • 38 వేల మందిని సురక్షితంగా తరలించారు
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

న్యూఢిల్లీ, మహా : దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు ఎన్‌డిఆర్ఎఫ్ వెన్నెముక వంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ అగ్నిప్రమాదాలు, పర్వత రక్షణ చర్యలు, సీబీఆర్ఎన్ వంటి కొత్త రకాల విపత్తులను ఎదుర్కొనడానికి ఎన్డీఆర్ఎఫ్ సిద్ధమైందని చెప్పారు. విపత్తుు గురైన ప్రజలను కాపాడేందుకు ప్రాణాలు కోల్పోయిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది త్యాగాలు దేశం ఎన్నటికీ మరువదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యం, అంకితభావం రాబోయే తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. గురువారం ఢిల్లీలో ఎన్‌డిఆర్ఎఫ్ అమరవీరుల సంస్మరణ సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. సంస్థ మెంబర్ సెక్రటరీ రాజేంద్ర సింగ్ , సభ్యులు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అటా హుస్సేన్ , డీజీ పీయూష్ ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారితో కలిసి ఫొటో దిగారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన ఎన్డీఆర్ఎఫ్ అమరవీరులకు ఘన నివాళి అర్పించడం ద్వారా వారి సేవలను, త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది అని అన్నారు. నేను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, దేశం ఎల్లప్పుడూ వారి త్యాగాన్ని స్మరించుకుంటుందని, వారి ధైర్యం మరియు అంకితభావం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని హామీ ఇస్తున్నానని అన్నారు. మన పోలీస్ బలగాలు, అందులో అర్ధసైనిక దళాలు, రాష్ట్ర పోలీస్ దళాలు, దేశ భద్రత, శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. వారి ధైర్యం, త్యాగం వల్లే మనం సరిహద్దులను రక్షించగలుగుతున్నామని తెలిపారు. ఉగ్రవాదం, నక్సలిజం వంటి ప్రమాదాలను ఎదుర్కొనగలుగుతున్నామని, ఎన్‌డిఆర్ఎఫ్ మన దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు వెన్నెముక వంటిదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ చూపుతున్న క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యం, త్యాగభావం ప్రపంచస్థాయి ప్రశంసనీయమైనదని, ఏ విపత్తు వచ్చినా, ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు సిద్ధంగా ఉండటం గొప్ప విషయమని పేర్కొన్నారు.

2013లో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌ఘాట్ విపత్తు నుండి మొదలు నేటి వరకు ఎన్‌డిఆర్ఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచారన్నారు. ఈ క్రమంలో 17 మంది వీర జవాన్లను కోల్పోయామని, ఈ రోజు వారి అసమాన ధైర్యానికి ఘన నివాళి అర్పిస్తున్నానని తెలిపారు. ఎన్‌డిఆర్ఎఫ్ సేవల పరిధి విస్తృతమైందని, దేశ వ్యాప్తంగా 16 బెటాలియన్లు, 28 రీజనల్ రెస్పాన్స్ సెంటర్ల ద్వారా ఈ దళం ప్రతిచోటా సహాయక చర్యలు అందిస్తోందని వివరించారు. ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు విపత్తు స్థలానికి చేరుకుంటే చాలు… పరిస్థితి అదుపులోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఇటీవలి కాలంలో ఎన్‌డిఆర్ఎఫ్ మయన్మార్ భూకంపంలో “ఆపరేషన్ బ్రహ్మ” పేరిట సహాయక చర్యలు చేపట్టిందని, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చోటుచేసుకున్న వర్షాలు, భూకంపాలు, వరదలు వంటి విపత్తుల్లో అసాధారణ సేవలందించింది. ఈ సంవత్సరంలోనే ఎన్‌డిఆర్ఎఫ్ 1060కు పైగా రక్షణ చర్యలను విజయవంతంగా నిర్వహించింది. సుమారు 1600 మంది ప్రాణాలను కాపాడటమే కాకుండా 38 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించిందన్నారు. అటవీ అగ్నిప్రమాదాలు, పర్వత రక్షణ చర్యలు వంటి కొత్త రకాల విపత్తులను సైతం ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధమయ్యాయన్నారు

Latest