- మొంథా తుపాన్
- తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు
- ఏపీలో తీరం దాటిన మొంథా తుపాన్ తెలంగాణను కూడా వణికిస్తోంది.
హైదరాబాద్, మహా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లాడించిన మొంథా తుపాన్ అవశేషమైన అల్పపీడనం తెలంగాణను వణికిస్తోంది. మొంథా అవశేషమైన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతంపై ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ గురువారం ఉదయం 05.30 గంటల సమయానికి తూర్పు విదర్భ, పక్కనే ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై పడిందని ఐఎండీ హైదరాబాద్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు. ఉత్తర దిశగా తూర్పు మధ్యప్రదేశ్, పక్కనే ఉన్న ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతూ రాబోయే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని ఆయన వివరించారు. మొంథా తుపాన్ అవశేషమైన అల్పపీడనం ప్రభావం తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరి, సోయాబీన్, పత్తి పంటలు దెబ్బతిన్నాయి.
తెలంగాణలో 30 ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు
మొంథా తుపాన్ ప్రభావం వల్ల వరంగల్, హన్మకొండ, కరీంనగర్, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. 204.50 మిల్లీమీటర్ల కంటే అధికంగా వర్షాలు కురిశాయని ఐఎండీ తెలిపింది. హన్మకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయని తెలిపారు. హన్మకొండ జిల్లాలో 50 శాతం ప్రాంతాల్లో అతి భారీవర్షం కురిసింది. వరంగల్ జిల్లాల్లో 42.9 శాతం, జనగామ జిల్లాలో 40 శాతం అతి భారీ వర్షాలు కురిశాయని వివరించారు.
44 మండలాల్లో అతి భారీవర్షాలు
తెలంగాణలోని 14 మండలాల్లో అతి భారీవర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 14 ప్రాంతాల్లో 204.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో 30 మండలాల్లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 46 మండలాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 123 మండలాల్లో 15.6 నుంచి 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. 81 స్టేషన్లలో 01 నుంచి 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఎ ధర్మరాజు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 368 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.
వర్షపాతం రికార్డులివి…
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో అత్యధికంగా 422.0 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ అధికారులు చెప్పారు. కరవు పీడిత మండలంగా పేరొందిన భీమదేవరపల్లిలో కరవు తీరా వర్షాలు కురిశాయి. వంగర చెరువు గండి పడే ముప్పు ఏర్పడటంతో పోలీసులు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించి నీటిని దిగువకు వదలడంతో ప్రమాదం తప్పింది. పర్వతగిరి మండలం కల్లెడలో 415.5 మిల్లీమీటర్లు, నెక్కొండ మండలం రెడ్లవాడలో 358.5 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్ ఉర్సులో 347.3 మిల్లీమీటర్లు, ధర్మసాగర్ లో 332.8 మిల్లీమీటర్లు, సంగెం మండలం కాపులకనపర్తిలో 332.8 మిల్లీమీటర్లు, వర్దన్నపేట మండలం వర్థన్నపేటలో 324.0 మిల్లీమీటర్లు, సంగెంలో 310.5మిల్లీమీటర్లు,సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో 304.3 మిల్లీమీటర్లు, జనగామలో 294.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. అతి భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. పలు జనవాసాలు, కాలనీలను వరద నీరు ముంచెత్తింది.
జిల్లాల్లో వెల్లువెత్తిన వరదలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలు…వరదలతో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో హన్మకొండ, ఖమ్మం, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
నీటిలో తేలియాడుతున్న మూడు ప్రాంతాలు
వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాలు వరదనీటిలో తేలియాడుతున్నాయి. సోమిడి చెరువు, వడ్డెపల్లి చెరువు, ఊర చెరువు నిండిపోయాయి. ఊరచెరువుకు పడిన గండితో వరంద ీనరు మూడు ప్రాంతాలను ముంచెత్తింది. 118 కాలనీలు నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతినగర్, హంటర్ రోడ్డు నీట మునిగాయి. హైదరాబాద్- వరంగల్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచాయి. స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతంలోనూ వరదనీరు పొంగి ప్రవహిస్తుంది. మొంథా తుపాన్ వల్ల భారీవర్షం వరంగల్ జిల్లాల్లో కురవడంతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలతో డిండి ప్రాజెక్టులోకి వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. శ్రీశైలం- హైదరాబాద్ మార్గంలో వరదనీటి ధాటికి తెగిపోయింది. ఈ రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
వరదనీటిలో కొట్టుకుపోయిన వ్యాన్
మొంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలకు కొణిజర్ల మండలంలో పడిగేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగులో వ్యాన్ కొట్టుకుపోయింది. తుమ్మలపల్లి గ్రామం రహదారిపై ఉధృతితో ప్రవహిస్తున్న వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఖమ్మం జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి సంసిద్ధతతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సహాయానికి ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్1077, వాట్సాప్ సెల్ నెంబర్ 9063211298 లను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు.
రోడ్లను ముంచెత్తిన వరదనీరు
రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లో లెవల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.ఖమ్మంరూరల్ మండలంలోని జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ తదితర మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. మొంథా తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు మున్నేరు వరద ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలు అనవసరంగా ముంపు ప్రాంతాల్లో తిరగవద్దని ఆయన సూచించారు. ఎగువ నుండి వచ్చే వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున #ఖమ్మం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి సంసిద్ధతతో స్థానికంగా ఉంటూ మరింత అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఖమ్మం నగరంలోని కాల్వొఒడ్డు, మున్నేరు ఘాట్, గణేష్ నిమర్జన ఘాట్, బొక్కలగడ్డ తదితర ప్రాంతాలలో మున్సిపల్ కమీషన్ అభిషేక్ ఆగస్త్య తో కలిసి పర్యటించారు. ప్రస్తుతం ఖమ్మం వద్ద మున్నేరు17అడుగుల మేర ప్రవహిస్తోందని మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉందన్నారు.
ఇల్లు వదిలి బయటకు రావద్దు
మొంథా తుఫాను కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు రావద్దని కోరారు. ట్రాన్స్ ఫార్మర్లు,విద్యుత్ స్తంభాలు,విద్యుత్ వైర్ల చెంతకు వెళ్లవద్దని సూచించారు. వర్షాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబరు 18004251442 కు సంప్రదించవచ్చునన్నారు. కాజీపేట్‌లోని శ్రీ వెంకటేశ్వర హోం నుంచి 152 మంది పిల్లలను వరద ప్రవాహం కారణంగా మడికొండ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్ స్టిట్యూషన్‌కు తరలించామని కలెక్టర్ చెప్పారు. మొంథా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
కొండపర్తి వద్ద కాలువ గండిని నివారించిన అధికారులు
హనుమకొండ జిల్లా యంత్రాంగం త్వరిత చర్యలు తీసుకొని ఇనవోలు మండలం కొండపర్తి వద్ద కాలువ తెగిపోవడాన్ని సమర్థవంతంగా ఆపారు. ధర్మసాగర్‌లోని ముప్పారం ట్యాంక్ నుండి భారీ వరదను విజయవంతంగా మళ్లించారు.
కరీంనగర్ జిల్లాలో…
కరీంనగర్ జిల్లాలో గురువారం పాఠశాలలను మూసివేశారు. రాబోయే రెండు రోజుల్లో మొంథా తుపాను ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముందుజాగ్రత్త చర్యగా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సైదాపూర్ మండలంలో వాగులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప పౌరులు ఇంటి లోపలే ఉండాలని, కల్వర్టులను దాటకుండా లేదా నీటి వనరులలోకి ప్రవేశించకుండా ఉండాలని కోరారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల దృష్ట్యా గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వాగులు, వంతెనలు, లోతట్టు ప్రాంతాలపై నిరంతర నిఘా పెట్టామని చెప్పారు.ప్రమాద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, వాగులు–వంతెనలు దాటవద్దని కోరారు. వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉంది అని కలెక్టర్ పేర్కొన్నారు







