- నిందితుడిని వదిలేసేందుకు రూ.2 కోట్లు
- టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నిర్వాకం
- సస్పెండ్ చేసిన సీపీ సజ్జనార్
- పై అధికారుల హస్తం ఉందన్న అనుమానాలు
హైదరాబాద్, మహా : అధిక వడ్డీ ఆశ చూపి జనాల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు రాబట్టి.. ఆ తర్వాత ముఖం చాటేసిన నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పోలీసు అధికారే.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అతడి వద్ద నుంచి రూ.2 కోట్లు తీసుకుని ఆర్థిక మోసగాడిని వదిలేశారు. ఇది కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనై విచారణ జరుపగా సదరు ఎస్ఐ నేరస్తుడి నుంచి రూ. 2 కోట్లు తీసుకుని వదిలేశాడని తేలింది. దీంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఉత్తర్వుల జారీ చేశారు. ఎస్ఐ శ్రీకాంత్.. సదాశివపేట దగ్గర ఆర్థిక నేరస్తుడిని తప్పించారు. అందుకు గాను అతడి వద్ద నుంచి రూ.2 కోట్లు తీసుకున్నాడు. ఆర్థిక నేరస్తుడైన ఉప్పలపాటి సతీష్ ముంబైలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఒక బృందం అక్కడకు వెళ్లింది. సతీష్‌ను అరెస్ట్ చేసి ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువస్తుండగా అతడు పరారయ్యాడు. సతీష్ పరారీ అయ్యేందుకు సహకరించడంతో శ్రీకాంత్ గౌడ్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
సతీష్‌ను అదుపులోకి తీసుకోవడం దగ్గర నుంచి అతడు పారిపోవడానికి సహకరించడం వరకు ఇలా ప్రతి అంశంలో కూడా ఎస్ఐ శ్రీకాంత్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ముంబైలో సతీష్ ఆచూకీ కనిపెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం కోసం ఎస్ఐ శ్రీకాంత్‌తో పాటు మరి కొందరు సిబ్బందిని గత గురువారం అక్కడకు పంపారు. గత గురువారం రాత్రి అనగా అక్టోబర్ 23వ తేదీ సతీష్‌తో పాటు అతడి భార్య, కుమార్తెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలానే వారి వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సాధారణంగా ఇలాంటి కేసుల్లో నిందితుల్ని పోలీసులు తమ వాహనంలోనే తరలిస్తారు. వారి చేతికి ఫోన్లు అందనీయరు. కానీ ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ శ్రీకాంత్ మాత్రం పోలీసులు ఉన్న కారు కాకుండా నిందితులతో కలిసి వాళ్ల కారు ఎక్కారు. పైగా వారితో డీల్ మాట్లాడుకుని డబ్బులు ఏర్పాటు చేయడం కోసం నిందితులకు మొబైల్ కూడా ఇచ్చారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీరి వాహనాన్ని నిందితుడి డ్రైవరే నడిపారు.
నిందితులది ఎస్‌యూవీ కాగా పోలీసులది పాత ఇన్నోవా. దీంతో ఈ రెండు వెహికల్స్ మధ్య దూరం దాదాపు 40 కి.మీలకు చేరింది. ఎస్ఐ, నిందితులు కలిసి ప్రయాణం చేస్తోన్న వాహనం సదాశివపేట్ చేరడానికి 2 గంటల ముందే అక్కడకు మరో కార్ వచ్చి రెడీగా ఉంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎస్‌ఐ, ఇతరులు ప్రయాణిస్తున్న వెహికల్ సదాశివపేట్‌లోని ఓ దాబా వద్దకు చేరింది. అప్పటికే అక్కడికి నిందితులకు సంబంధించిన కారు వచ్చి ఉంది. దాబా వద్ద కార్ ఆగగానే నిందితులు తమ కోసం వచ్చిన వెహికల్ ఎక్కి కొల్హాపూర్ వైపు పారిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి వెనుక వస్తున్న తన బృందానికి నిందితులు పారిపోయినట్లు ఎస్‌ఐ సమాచారం ఇచ్చారు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సదరు ఎస్‌ఐ అక్కడే ఉండిపోవడమో లేదంటే సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు వెళ్లిన దారిలో వెళ్లి వారిని గాలించడమో చేయాలి. కానీ ఇక్కడ ఎస్ఐ శ్రీకాంత్ మాత్రం నిందుతుడి కారులో అతడి డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. వారు బయలుదేరిన కాసేపటికి ఇతర సిబ్బంది దాబా వద్దకు చేరుకుని ఎస్ఐకి కాల్ చేయగా నిందితులు పారిపోయారని తాను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పాడు. అలా సిటీకి వచ్చేసిన సదరు ఎస్‌ఐ ఎక్కడెక్కడకు వెళ్లారు.. ఎవరిని కలిశారు వంటి తదితర అంశాలను ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈఎస్‌ఐతో పాటు సతీష్ కుటుంబీకులు ప్రయాణించిన కారు డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించారు. మొత్తంగా శ్రీకాంత్ తప్పదం పూర్తిగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన సీపీ అతడిని సస్పెండ్ చేసి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. శ్రీకాంత్ వ్యవహారం వెనుక పై అధికారుల హస్తం ఉండవచ్చన్న అనుమానాలు రావడంతో లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించిన సీపీ దర్యాప్తు అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు







