Mahaa Daily Exclusive

  శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట…..ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..

Share

  • ఏపీలో తీవ్ర విషాదం
  • శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట
  • ఘటనలో మంది మృతి, పలువురికి గాయాలు
  • సంతాపం ప్రకటించిన సీఎంలు చంద్రబాబు, రేవంత్
  • ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన

శ్రీకాకుళం, మహా: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కార్తీక మాసం శనివారం, పైగా ఏకాదశి కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో తోపులాట జరిగటంతో…. రెయిలింగ్ విరిగిపోవటంతో ఈ విషాదం జరిగినట్టు సమాచారం.ఈ ఆలయాన్ని నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. సుమారు రూ.20 కోట్లతో నిర్మాణ జరిగింది. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలోనే… ఏకాదశి కావటంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అత్యంత విషాదం: సీఎం చంద్రబాబు..
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. “శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందిన ఘటన దురదృష్టకరమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషాకరమైన ఘటనలో మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఘటనపై స్పందించిన మోడీ.. పరిహారం ప్రకటన
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన మీద ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ప్రకటించారు

Latest