Mahaa Daily Exclusive

  జోరుగా “మైక్రో” ఫైనాన్స్ దందా..!

Share

  • జోరుగా “మైక్రో” ఫైనాన్స్ దందా..!
  • గిరిజన పల్లెలు, అమాయక నిరుపేదలే బలి.
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణాలు

మహదేవ్ పూర్, మహా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం లోని అన్నారం చండ్రుపల్లి, నాగ పల్లి, మద్దులపల్లి, కాళేశ్వరం ప్రాంతాల్లో మైక్రోఫైనాన్స్ పేరుతో వడ్డీ వ్యాపారం చెలరేగిపోతోంది. పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ కంపెనీలు అధిక వడ్డీలతో రుణాలు ఇస్తూ నిరుపేదలను బారిన పడేస్తున్నాయి. షెడ్యూల్ ఏరియా మంచిర్యాల్ జిల్లా చెన్నూర్ పట్టణం లో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఒక గది అద్దెకు తీసుకొని కొందరు యువకులను సిబ్బందిగా పెట్టుకొని రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తు న్నారు. గిరిజన పల్లెలను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ గ్రామాల్లో పది మంది మహిళలను ఒక గ్రూప్ గా చేసి ఒకొక్కిరి 50 వేల వరకు రుణాలు ఇస్తున్నారు. ఆ గ్రూపు లో ఉన్న పది మంది కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఒక్కొక్క ఇన్సూరెన్స్ 2000 రూపాయాలు తీసుకుంటున్నారు. ఇంతేకాక లోన్ ప్రాసెస్ చేసినందుకు ఒక్కొక్కరికి 1000 నుంచి 1500 వరకు తీసుకుంటున్నారు. ఈ విధంగా షెడ్యూల్ ఏరియాలో గిరిజన గ్రామాల్లోని మహిళలే టార్గెట్ గా చేసుకొని కొన్ని వందల గ్రూపులు ఏర్పాటు చేసి కోట్ల రూపాయల లావాదేవీలు సాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం మాత్రం కళ్లుమూసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అడ్డగోలుగా వసూళ్లు

రోజువారీ కూలీలు, నిరక్షరాస్యులను వాడుకొని సూటికి 5,10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో డాక్యుమెంట్ చార్జీలు, ఇన్సూరెన్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారు. వాయిదాలు ఆలస్యమైతే ఇంటి గడప దాటి బలవంతపు వసూళ్లకు కూడా తెగబడుతున్నారు. “రోజూ చేసేది కూలి అంతా వడ్డీలకే పోతోంది. పిల్లల భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడుతోంది” అని ఒక మహిళ వాపోయింది “ఇంట్లోకి చొరబడి వసూళ్లు చేస్తున్నారు. పరువు ప్రతిష్టలను పణంగా పెడుతున్నారు” అని ఒక కూలీ ఆవేదన వ్యక్తం చేశాడు. చిరు వ్యాపారులు, కూలీలు, గిరిజనులు భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి

గిరిజన పల్లెల్లో విచ్చలవిడిగా సాగుతున్న మైక్రోఫైనాన్స్ దందా పేదల జీవనాన్ని కుదిపేస్తోంది. వడ్డీ వ్యాపారుల అణచివేతలతో అమాయకులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు అధికారు తక్షణమే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక మనీ లెండర్స్ యాక్ట్ ప్రకారం కూడా, లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం నడపడం నేరం. అదే విధంగా ఆర్బీఐ మార్గదర్శ కాలు ప్రకారం మైక్రోఫైనాన్స్ సంస్థలు షెడ్యూల్డ్ ఏరియాస్లో ప్రత్యేక అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయరాదు. అయినా కూడా ప్రైవేట్ కంపెనీలు “ఫైనాన్స్ సొసైటీలు”, “మైక్రోఫైనాన్స్ గ్రూపులు” అనే పేర్లతో గిరిజన ప్రాంతాల్లో దందా సాగించడం చట్టానికి విరుద్ధమే. ఇలాంటి కంపెనీలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు మేధావులు కోరుతున్నారు

Latest