- సర్వేలను నమ్మం
- జూబ్లిహిల్స్ లో టీడీపీతో సహా ఎన్డీఏ కూటమి పార్టీల మద్ధతు మాకే
- అమలు కాని హామీలివ్వం, చేసేదే ప్రజలకు చెప్తున్నాం
- మీడియాతో చిట్ చాట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్‌లో మాకు టీడీపీ మద్దతు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాకు తెలిపారు. టీడీపీ మద్దతే కాదు ఎన్డీఏ కూటమిలోనీ పార్టీల మద్దతు కూడా ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కిషన్ రెడ్డి తాము ఎప్పుడూ సర్వేలు చేయించుకోలేదని, సర్వేలను నమ్మే బ్యాచ్ మాది కాదన్నారు. ఇంటింటి ప్రచారాన్ని, బీజేపీ కేడర్‌ను నమ్ముతామన్నారు. ఉప ఎన్నికలో ఓటమి తధ్యమని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టీకరమ విధానాలకు తెరలేపిందని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో టికెట్ ఇస్తే గెలువని ఆజార్‌కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వడం మాకు చేతకాదని.. చేసే పనులే చెప్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరు మాట్లాడినా.. బీజేపీపై విమర్శలు చేస్తున్నారంటే బీజేపీ బలం ఏ మేరకు ఉందన్నది స్పష్టమవుతుందన్నారు. జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోటీ ఉంది కాబట్టి బీజేపీ గెలుస్తుంది అని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ ఉపఎన్నిక దేనికీ ప్రాధాన్యం కాదు.. ప్రజలు విజ్ఞులు.. ఎప్పుడు ఏ పార్టీని ఆదరించాలో వారికి తెలుసన్నారు. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం జరగాలి, రాజకీయంగా ఎదగాలని తాను కోరుకుంటానని చెప్పారు. జుబ్లిహిల్స్ తో పాటు రాష్ట్రంలో ఏదైన అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కేంద్రం ఇచ్చిన నిధులతోనే అని అన్నారు. ప్రచారం సందర్భంగా ప్రజలకు అన్ని విషయాలను తెలుపుతున్నానని, ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందన్నారు







