- స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- సిద్దంగా ఉన్నామన్న ఎస్ఈసీ
- విచారణ 24 కు వాయిదా
హైదరాబాద్, మహా : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావించిన ప్రభుత్వానికి కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అయితే, కోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బెంచ్కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని ఆయన కోరారు. ప్రభుత్వ వాదన అలా ఉండగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి దీంతో కేసు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసింది. అప్పటిలోగా ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన అభిప్రాయాన్ని కోర్టుకు సమర్పించాల్సి ఉంది







