Mahaa Daily Exclusive

  కాళేశ్వ‌రం క‌మీష‌న్ సొమ్ముతో బిఆర్ఎస్ కుట్ర‌…జూబ్లిహిల్స్ ప్రచారంలో మంత్రి పొంగులేటి..

Share

  • కాళేశ్వ‌రం క‌మీష‌న్ సొమ్ముతో బిఆర్ఎస్ కుట్ర‌
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్నికూల‌దోయ‌డానికి ప‌న్నాగాలు
  • 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తా
  • జూబ్లిహిల్స్ ప్రచారంలో మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్, మహా : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అవినీతి చేసి సంపాదించిన ల‌క్ష కోట్ల‌ను బిఆర్ఎస్ ఇప్పుడు రాజ‌కీయాల్లో అడ్డ‌దారిన ఉప‌యోగిస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఆరోపించారు. సోమ‌వారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ లో మంత్రి పాదయాత్ర నిర్వ‌హించారు. ఎస్.పి.ఆర్. హిల్స్ నుంచి జెండాకట్ట‌, కార్మిక‌న‌గ‌ర్‌, వినాయ‌క‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఆయ‌న ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వ‌హించి కాంగ్రెస్ అభ్య‌ర్ది న‌వీన్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్లతో జూబ్లీహిల్స్ ఉప ఎన్న‌ిక‌లో కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంద‌న్నారు. ఆ అవినీతి సొమ్ముతోనే బిఆర్ఎస్ విచ్చలవిడి ప్రచారం చేస్తోంద‌ని ఆరోపించారు. 500 రోజుల్లో ప్రభుత్వానికి ఏమైనా జ‌ర‌గొచ్చునంటూ కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ రెండు సంవత్సరాలు పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 500 రోజుల్లో ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అవినీతి సొమ్ము ఏరులై పారుతుంద‌ని, ఓడిపోతామ‌ని తెలిసి ఆ పార్టీ నాయ‌కులు అవాకులు చ‌వాకులు పేలుతున్నార‌న్నారు. విజ్ఞ‌ులైన ఓట‌ర్లు గ‌త ప‌దేళ్ల‌లో నాటి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు, ఈ ప్రాంతానికి ఏమి చేసిందో గ‌మ‌నించాలన్నారు. ఉచిత బ‌స్సు మొద‌లు కొని ఎన్నోసంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తున్న కాంగ్రెస్ అభ్య‌ర్ది న‌వీన్ యాద‌వ్ ను మంచి మెజార్టీతో గెలిపించాల‌న్నారు. ప‌దేళ్లలో చేయ‌ని అభివృద్ది ఇప్పుడు బీఆర్ఎస్ తో ఏం జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఓట్ల కోసం వ‌చ్చే భారాసా నాయ‌కులను ఇంత‌వ‌ర‌కు ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ ప్ర‌శ్నించాల‌ని మంత్రి ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ మూడేళ్లే గాక మ‌రో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని, పేదోళ్ల క‌న్నీరు తుడిచే వ‌ర‌కు కాంగ్రెస్ విశ్ర‌మించ‌ద‌ని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి తాము ఇంత‌వ‌ర‌కు గ్రామీణ ప్ర‌జ‌ల‌పై దృష్టి సారించామ‌ని ఇక‌పై పట్ట‌ణ పేద‌ల‌కు ఇండ్లు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌లో చేరిక‌లు:

మంత్రి పొంగులేటి సమక్షంలో ఎస్‌పీఆర్ హిల్స్‌లో బిఆర్ఎస్ నుంచి ప్రేమ్ ఆధ్వర్యంలో 200 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్ర‌హ్మ‌శంక‌ర్ న‌గ‌ర్‌లో బి.క‌ళ ఆధ్వ‌ర్యంలో ప‌దిమంది మ‌హిళ‌లు బిజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేర‌గా మంత్రి పొంగులేటి వారికి కండువాలు క‌ప్పి ఆహ్వానించారు. కార్మిక‌న‌గ‌ర్‌లో ఆటో యూనియన్ అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో 200 మంది ఆటో డ్రైవర్లు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వీరికి మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ అభ్య‌ర్ధి న‌వీన్ యాద‌వ్ స్వాగ‌తం ప‌లికారు. ఆటో కార్మికుల చేరిక సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సతీష్ ఆటోలో మంత్రి పొంగులేటి కొద్దిదూరం ప్ర‌యాణించారు

Latest