Mahaa Daily Exclusive

  అమెరికాలో పెళ్ళి … మూడున్నరేళ్లకు విడాకులు….కిడ్నాప్ చేసి డబ్బులు లాగే ప్రయత్నం

Share

  • అమెరికాలో పెళ్ళి … మూడున్నరేళ్లకు విడాకులు
  • భర్త ఆస్తులపై భార్య కన్ను
  • విడాకుల తర్వాత బెడిసికొట్టిన ప్లాన్..
  • దీంతో కిడ్నాప్ చేసి డబ్బులు లాగే ప్రయత్నం
  • ఛేదించిన పోలీసులు
  • కిలాడీ లేడీ ఆటకట్టించిన పోలీసులు
  • అంబర్‌పేట్‌ కిడ్నాప్‌ కేసులో 10 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌ : అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన చోటు చేసుకున్న కిడ్నాప్‌ కేసును అంబర్‌పేట్‌ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న 10 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి తెలిపారు. మంత్రి శ్యామ్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి రూ.1.5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఆరుగురు నిందితులు శ్యామ్‌ను అపహరించారని పోలీసులు గుర్తించారు. వారు రెంట్‌ కార్లలో ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో మంత్రి శ్యామ్‌తో వివాహం చేసుకొని మూడు సంవత్సరాల వ్యవధిలోనే విడాకులు పొందింది. గత మూడు సంవత్సరాలుగా ఆమె భర్తకు దూరంగా ఉంది. బాధితుడు శ్యామ్‌ తన పేరును ‘అలి’గా మార్చుకొని ఫాతిమా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. శ్యామ్‌ తండ్రి నుంచి వచ్చిన రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌ ప్రధాన సూత్రధారి సాయి అనే వ్యక్తి రాంనగర్‌ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. మరో నిందితురాలు జీ. ప్రీతి లేడీ బౌన్సర్‌గా పని చేస్తుండగా, ఎల్‌. సరిత అనే మరో మహిళ బాధితుడు ఉన్న అపార్ట్‌మెంట్‌లోనే ఘటనకు రెండు రోజుల ముందు నివసించి, అతని కదలికలపై నిఘా పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ రూ. 30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు విచారణలో తేలింది. బాధితుడు డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి తన స్నేహితుడికి ఫోన్‌ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. శ్యామ్‌ తెలివిగా తప్పించుకుని పోలీసులకు వివరాలు తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని అరెస్ట్‌ చేశారు. కేసులో మిగిలిన నలుగురిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు

Latest